గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారిని ఓ చిరుతపులి లాక్కెళ్లి చంపుకుని తినేసింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు స్పష్టంచేశారు. అయితే, ఇలాంటి సంఘటన జరగడం ఇది గడచిన నెల రోజుల్లో మూడోది కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన దాహోద్ జిల్లాలోని సంగసర్ గ్రామ సమీపంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సోమవారం సాయంత్రం ధన్‌పూర్ తాలూకాలో తన ఇంటి వెలుపల ఆడుకుంటున్న చిన్నారిని చిరుత లాక్కెళ్లిందని వాసియా దుంగ్రీ అటవీ శ్రేణి అధికారి మహేశ్ పర్మార్ తెలిపారు. మంగళవారం ఉదయం సగం తిన్న మృతదేహం అడవిలో లభించగా అది ఆ బాలికదేనని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 8న అదే తాలూకాలోని కాంటు గ్రామంలో ఒక పిల్లవాడిని చిరుతపులి చంపి తినేసింది. జూలై 26న ఖాజురి గ్రామ సమీపంలో ఒక గొర్రెల కాపరి చిరుత దాడిలో మృతిచెందాడు. జూలై, ఆగస్టులో ఈ ప్రాంతంలో చిరుతపులులు మనుషులపై దాడి చేసిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అడవుల్లో సుమారు 24 పులుల వరకు దాగి ఉన్నాయని ఆయన అంచనా వేశారు.
ఈ ప్రాంతంలోని 12 గ్రామాల్లో చిరుతల దాడులు షరామామూలేనని పర్మార్ తెలిపారు. చిరుత పులులను పట్టుకోవడానికి జనావాసాల దగ్గర వివిధ ప్రదేశాల్లో అనేక బోన్లు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అదేప్రాంతంలో సోమవారం రాత్రి ఒక చిరుతపులి పట్టుబడిందని, అయితే ఇదే చిరుత బాలికపై దాడి చేసిందా అనేది మాత్రం స్పష్టంగా తెలియదని ఆయన వెల్లడించారు.