Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనలో దళితులు ద్వితీయ శ్రేణి పౌరుల్లా బతుకుతున్నారు: వర్ల రామయ్య

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (09:37 IST)
జగన్ పాలనలో దళితులంతా ద్వితీయ శ్రేణి పౌరుల్లా బతకాల్సిన దుస్థితి దాపురించిందని, ఉన్నతస్థానాల్లో ఉన్న దళితులకే న్యాయం జరగకపోతే, ఇక సామాన్యులైన దళితబిడ్డల పరిస్థితి ఏమిటని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వాపోయారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారతదేశ పౌరులుందరికీ సమానహక్కులు కల్పించిన, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చే రచింపబడిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతున్నదా అని అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగందారి రాజ్యాంగానిదే..తమ దారి తమదే అన్నట్లుగా కొందరు పెద్దలు వ్యవహరిస్తున్నారని, అందుకు సంబంధించిన తార్కాణాలు ఇక్కడ కనిపిస్తున్నాయన్నారు.

రాజ్యాంగం దళితులకు సంక్రమింపచేసిన హక్కులు కాలరాయబడుతున్నాయని రామయ్య తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులంతా తమ ప్రాథమిక హక్కులు కోల్పోయినట్లు భావిస్తున్నారన్నారు.

దురదృష్టవశాత్తూ సస్పెన్షన్ లో ఉన్న ఒక దళిత మేజిస్ట్రేట్ అయిన రామకృష్ణ అనే వ్యక్తిపై, సరిహద్దు గొడవలకు సంబంధించిన కొందరు వ్యక్తులు అకారణంగా దాడిచేశారని, ఆయన స్థలంలోని ఇటుకలను తీసుకెళ్లారని, దాన్ని అడ్డుకోబోయిన దళితవర్గానికి చెందిన వ్యక్తిపై అమానుషంగా ఇటుకలు, ఇనుపరాడ్లతో దాడిచేయడం జరిగిందన్నారు.

తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే, అక్కడున్న ఎస్సై ఆయన నుంచి ఫిర్యాదు తీసుకోకపోగా, “ పెద్దలతో నీకెందుకయ్యా.. వారంతా వైసీపీవారు....అని చెప్పి తిప్పి పంపడం  ఎంతవరకు న్యాయమో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

ప్రజల డబ్బుని జీతంగా తీసుకునే సదరు పోలీస్ అధికారి తక్షణమే మేజిస్ట్రేట్ నుంచి కేసు తీసుకొని, ఆయనపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయకుండా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడమేంటని రామయ్య నిలదీశారు. జగన్ పాలనలో ఏపీ పోలీస్ మాన్యువల్ సక్రమంగా అమలవదా.. భారత రాజ్యాంగం అమలు కాదా అని వర్ల ప్రశ్నించారు.

ఇంకెంతకాలం జగన్ పాలనలో దళితులు ఇబ్బందులు, అగచాట్లు, బాధలు భరించాలన్నారు. జగన్ కు నైతిక విలువలుంటే, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నిజంగా అమల్లో ఉంటే, మంత్రి పెద్దిరెడ్డిని తక్షణమే పదవినుంచి బర్తరఫ్ చేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని రామయ్య డిమాండ్ చేశారు.

మేజిస్ట్రేట్ నుంచి ఫిర్యాదు తీసుకోకుండా అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తుతూ, మంత్రిగారితో పెట్టుకోవద్దంటూ ఉచిత సలహాలిచ్చిన సదరు పోలీస్ అధికారిని కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్  చేయాలన్నారు. జగన్ ప్రభుత్వం నిజంగా ప్రజా ప్రభుత్వమో..లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు. 

మేజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న దళితుడికే న్యాయం జరగకపోతే, ఇక సామాన్య దళితులు, చెప్పులుకుట్టేవారు, పొలం పనిచేసే వారికి ఏం న్యాయం జరుగుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. మొన్న డాక్టర్ సుధాకర్,  నిన్నడాక్టర్ అనితారాణి, నేడు మేజిస్ట్రేట్ రామకృష్ణల పరిస్థితి చూస్తుంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి చులకనగా చూస్తున్నారని అర్థమవుతోందన్నారు. 
 
మేజిస్ట్రేట్ రామకృష్ణ కడపజిల్లాలో పనిచేస్తున్నప్పుడు, అక్కడ అదనపు న్యాయమూర్తిగా పవన్ కుమార్ రెడ్డి పనిచేసేవారని, ఆయన మాజీ న్యాయమూర్తి, రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్ పర్సన్ అయిన నాగార్జున రెడ్డికి సొంత తమ్ముడేనని రామయ్య చెప్పారు.

సదరు పవన్ కుమార్ రెడ్డి వద్ద పనిచేసే రామానుజం అని వ్యక్తిని పిలిచి, తెల్లకాగితాలపై సంతకం చేయాలని, తాను చెప్పినవిధంగా చేయని నేరం ఒప్పుకోవాలని ఆదేశించగా, ఆ రామానుజం తిరస్కరించడం జరిగిందన్నారు. తాను చెప్పింది వినలేదన్న అక్కసుతో సదరు రామానుజాన్ని పవన్ కుమార్ రెడ్డే, కొట్టించి, కిరోసిన్ పోసి తగులబెట్టబోతుంటే, అతను పారిపోయి ఆసుపత్రిలో చేరాడన్నారు.

రామానుజం చనిపోతూ, తనచావుకి కారణం పవన్ కుమార్ రెడ్డేనని మరణ వాంగ్మూలం ఇవ్వడం జరిగిందని, ఆ వాంగ్మూలాన్ని రామకృష్ణ నమోదు చేయడం జరిగిందన్నారు. 30-11-2012న అప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న నాగార్జున రెడ్డి, రామకృష్ణకు ఫోన్ చేసి, మరణవాంగ్మూలం నుంచి తన తమ్ముడైన పవన్ కుమార్ రెడ్డి పేరు తొలిగించాలని కోరడం, దాన్ని రామకృష్ణ తిరస్కరించడం జరిగాయన్నారు.

13-02-2012న నాగార్జున రెడ్డి హైకోర్టు జడ్జిహోదాలో రాయచోటి వచ్చి, రామకృష్ణకు రమ్మని చెప్పడం జరిగిందన్నారు. రామకృష్ణ అక్కడకు వెళ్లగానే, నాగార్జునరెడ్డి, ఆయన తమ్ముడైన పవన్ కుమార్ రెడ్డి, రామకృష్ణపై పడి బూటుకాళ్లతో తంతూ, కులంపేరుతో దూషిస్తూ, నానా మాటలు అంటూ, దారుణాతి దారుణంగా ప్రవర్తించడం జరిగిందని వర్ల రామయ్య తెలిపారు.

నాగార్జున రెడ్డి ఆనాడు మేజిస్ట్రేట్ రామకృష్ణను ఉద్దేశించి వాడిన బూతుమాట విన్నవారెవరైనా సరే, ఆత్మాభిమానంతో, పౌరుషంతో తనను తిట్టిన వారి పీకకోయడమో.. లేక తన పీక తాను కోసుకోవడమో జరిగి ఉండేదన్నారు.  అంతటితో ఆగకుండా రామకృష్ణపై కక్ష పెంచుకున్న నాగార్జున రెడ్డి, ఆయన్ని దూరంగా చింతపల్లి ఏరియాకు బదిలీ చేయించడం జరిగిందన్నారు.

తరువాత రామకృష్ణపై లేనిపోని తప్పుడు ఫిర్యాదులు మోపి, చివరకు ఆయన్ని సస్పెండ్ చేయించడం జరిగిందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటానికి సిద్ధమైన రామకృష్ణ, ‍హైకోర్టులో ఫిర్యాదు చేస్తే, అక్కడున్న కొందరు పెద్దలు నాగార్జున రెడ్డితో నీకెందుకు వెళ్లమని చెప్పి నీరు గార్చడం జరిగిందన్నారు.

మరింత పట్టుదలతో ముందుకెళ్లిన రామకృష్ణ, నాగార్జున రెడ్డికి తగిన విధంగా శిక్ష పడేలా చేయాలన్న తలంపుతో పార్లమెంట్ ను ఆశ్రయించి, డిసెంబర్ 5-2016న నాగార్జున రెడ్డిపై 54మంది ఎంపీల సంతకాలతో ఇంపీచ్ మెంట్ పిటిషన్ వచ్చేలా చేయడం జరిగిందన్నారు. హైకోర్టు జడ్జిగా ఉన్న నాగార్జున రెడ్డి, దళితులపై ఈ విధంగా వ్యవహరించారని, ఆర్టికల్ 217, రెడ్ విత్ 124 ప్రకారం ఇంపీచ్ మెంట్ పిటిషన్ వేయడమైందన్నారు.

ఆ పిటిషన్ అమల్లో ఉండగానే, తన వర్గానికి చెందిన కొందరి సాయంతో రామకృష్ణను సస్సెండ్ చేయించడం జరిగిందని, తరువాత 2018లో నాగార్జునరెడ్డి రిటైరయ్యారని, ఆ తరువాత జగన్ ప్రభుత్వం సదరు నాగార్జునరెడ్డికి కేబినెట్ హోదా కల్పించి, ఏపీ ఈ ఆర్ సీ కమిషన్ చైర్ పర్సన్ గా నియమించడం జరిగిందన్నారు. నాగార్జున రెడ్డిలో ఏమి నచ్చి జగన్ ఆయనకు పదవి కట్టబెట్టాడో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్  చేశారు.

ఒక దళితుడి ఆత్మఘోషను ఎవరూ పట్టించుకోరు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. చేయరాని తప్పుచేసిన నాగార్జున రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని రామయ్య నిలదీశారు. తప్పుచేసిన వారిని ముఖ్యమంత్రి అమితంగా ప్రేమిస్తారు అనడానికి ఇంతకంటే రుజువు ఏముంటుందన్నారు.

జగన్మోహన్ రెడ్డికి నిజంగా రాజ్యాంగంపై గౌరవం, చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా తన పొరబాటు గ్రహించి, నాగార్జున రెడ్డిని తక్షణమే ఏపీ ఈ ఆర్ సీ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించాలన్నారు. ఇంతటి దురాగతానికి పాల్పడిన నాగార్జున రెడ్డి నిజంగా సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

రాష్ట్రంలోని దళితజాతి మొత్తం ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేంగా ఉద్యమించకముందే, జగన్  ప్రభుత్వం నాగార్జున రెడ్డిపై చర్యలు తీసుకోవడంతో పాటు, మేజిస్ట్రేట్ రామకృష్ణపై దాడిచేసిన వారిని కాపాడిన మంత్రి పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. రామకృష్ణ నుంచి ఫిర్యాదుతీసుకోకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఎస్సైని కూడా ఉద్యోగం నుంచి తీసేయాలని వర్ల డిమాండ్ చేశారు.

ఎన్నిచట్టాలు, శాసనాలు చేసినా పాలకుల్లో వాటిని అమలుచేయాలన్న చిత్తశుధ్ధి లేకపోతే, అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అనడానికి జగన్ ప్రభుత్వ విధానాలే నిదర్శనమని రామయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న ఆకృత్యాలు, అమానుషాలను తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments