నిరంతరం ప్రజలతో మెలుగుతున్న తమకు కూడా వివిధ శాఖలకు కల్పించిన కరోనా బీమా భద్రతను వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర మరియు విజయవాడ అధ్యక్షుడు మండాది వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మండాది వెంకట్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, కృష్ణా జిల్లా అధ్యక్షుడు ముత్యాల శేషు ఆధ్వర్యంలో జిల్లాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రేషన్ డీలర్లు విజయవాడలో గాంధీనగర్ పౌరసరఫరాల కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. రేషన్ పంపిణీ చేసే డీలర్స్ భద్రత, భరోసా కోసం (కరోన భీమా) బీమా కల్పించాలని, ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 5 విడతల కమిషన్ ఒకేసారి మంజూరు చేయాలని, కార్డుదారుని వేలి ముద్రకు ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.
ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు, రాష్ట్ర పౌరసరఫరాల కమీషనర్‌కి వినతిపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చని పక్షంలో గత్యంతరం లేక డీలర్స్ ప్రాణాలకు, కుటుంబాలకు, భద్రత కల్పించలేని పరిస్థితుల్లో 8వ విడత పంపిణీకి దూరంగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఎన్నడూ చూడని కరోనా మహమ్మారికి ఇప్పటికే నలుగురు మరణించారని ఇంకొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గుజరాత్ రాష్ట్రంలో డీలర్స్ ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం సీఎం విజయ్ రూపాని తరపున ముఖ్య కార్యదర్శి అశ్వనీకుమార్ ఆ రాష్ట్రంలో 17 వేల మంది డీలర్స్‌కు ఒక్కక్కరికి రూ.25 లక్షలు విలువైన కరోన బీమా ప్రకటించారని గుర్తుచేశారు.
ఆ స్పందన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద కనిపించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శివప్రసాద్, నగర సంఘ ప్రతినిధులు మెడిశెట్టి శ్రీనివాసరావు, ఎం.భీముడు, సుబ్బారెడ్డి, పూర్ణ, ఆంజనేయులు, ఖాసీం, కోట శ్రీను, పుల్లారావు, అజయ్, ప్రభాకర్ ఇతర కమిటీ సభ్యులు, నగరంలోని పలువురు డీలర్లు పాల్గొన్నారు.