కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి చెరగని ముద్ర.. కార్యకర్తలంటే పంచప్రాణాలతో సమానం
కర్నూలు జిల్లా రాజకీయాల్లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెరగని ముద్ర వేశారు. పైగా, ఈ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం కూడా ఉంది. ఆళ్లగడ్డలో ఉంటూనే జిల్లా రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకుని శాసి
కర్నూలు జిల్లా రాజకీయాల్లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెరగని ముద్ర వేశారు. పైగా, ఈ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం కూడా ఉంది. ఆళ్లగడ్డలో ఉంటూనే జిల్లా రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకుని శాసించారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోయిన విషయం తెల్సిందే.
1964 జనవరి 8న కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లిలో భూమా జన్మించారు. భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తండ్రి హత్య తర్వాత రాజకీయాల్లోకి భూమా నాగిరెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడి మృతి తర్వాత 1992 ఉప ఎన్నికల్లో భూమా మొదటిసారి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు.
2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో కూతురు అఖిలప్రియతో కలిసి భూమా టీడీపీలో చేరారు. టీడీపీతోనే రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకుని భూమా భావించారు. అయితే కూతురు అఖిల ప్రియ రాజకీయాల్లో స్థిరపడ్డాక విశ్రాంతి తీసుకుంటానని భూమా నాగిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు.
2014 ఏప్రిల్ 24 న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభ మృతి చెందారు. శోభ మృతి తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఏడాది నుంచి భూమా నాగిరెడ్డి ఆరోగ్యం సరిగా లేదు. గత వారం రోజులుగా భూమా అనారోగ్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాగా, నమ్ముకున్న నాయకుల కోసం భూమా తన వంతు సహాయ సహకారాలు అందించేవారు. పార్టీ కోసం విశిష్ట సేవలందించిన కొలిమిగుండ్ల నేత ఎర్రబోతుల వెంకటరెడ్డికి భూమానే అసెంబ్లీ టికెట్ ఇప్పించారు. ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల ప్రాంతాల్లో ఫ్యాక్షన్ తీవ్రత తగ్గించడానికి చేపట్టిన శాంతి పాదయాత్రలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె గ్రామంలో కార్యకర్తలపై దాడి జరిగితే.. వెంటనే అక్కడికి వెళ్లి వారికి అండగా నిలిచారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి కేసులు ఎదుర్కొన్నారు.
కార్యకర్తలే నా ప్రాణం అంటూ పలు సందర్భాల్లో ప్రకటించి వారి కోసం పనిచేశారు. నంద్యాల డివిజన్ పరిధిలోని 17 మండలాల్లో భూమా చెరగని ముద్రవేశారు. కార్యకర్తలకు సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా హాజరయ్యేవారు. భూమా మృతితో ఓ గొప్ప నేతను కోల్పోయామని కర్నూలు ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఊహించని ఘటనతో భూమా కుటుంబసభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. శోభానాగిరెడ్డి మృతికి సంబంధించిన చేదు గురుతులు చెరిగిపోక ముందే భూమా కూడా మరణించడంతో అనుచరులు షాక్‌కు గురయ్యారు.