కరకట్ట రోడ్డు మార్గం ద్వారా వెళ్లేవారికి ఆ రోడ్డు గురించి తెలియని వారు వుండరు. ఎందుకంటే ఒక వాహనం వెళ్తుంటే ఎదురుగా మరో వాహనం వచ్చిందంటే రెండో వాహనం వారు చాలా జాగ్రత్త వహించాల్సి వుంటుంది. అలా కాకుండా ఏమవుతుందిలే అని కారు నడిపేస్తే అది కాస్తా జర్రుమని జారుకుంటూ రోడ్డుకి పక్కనే వున్న పల్లంలోకి పోయి బోల్తా కొడుతుంది. ఇటువంటి ఘటనే శుక్రవారం నాడు జరిగింది.
శుక్రవారం తెల్లవారు జామున విజయవాడలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వర్షంతో నగరం తడిసి ముద్దయ్యింది. ఇక అమరావతి కరకట్ట రోడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రోడ్డుకి ఇరువైపులా చిత్తడిగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఆ మార్గాన వెళ్తున్న ఓ కారు సీఎం చంద్రబాబు నివాసం సమీపంలోని తపోవనం వద్ద కరకట్ట రోడ్డు పైనుండి ప్రమాదవశాత్తూ అదుపుతప్పి గుంతలో పడింది. ఐతే కారులో వున్నవారికి పెద్ద గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కారులో సచివాలయంలోని హోంశాఖలో పనిచేసే ఉద్యోగులు వున్నట్లు సమాచారం.