Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు చరిత్ర మార్చే గొప్ప పథకం.. జగన్‌

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (06:32 IST)
రైతు చరిత్రను మార్చే ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుడుతూ ‘వైయస్సార్‌ రైతు భరోసా–సీఎం కిసాన్‌’ పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తమ ప్రభుత్వం ఈ పథకం చేపట్టిందని ఆయన వెల్లడించారు. ఎన్నికల వాగ్దానాల్లో మరో పథకాన్ని, గతంలో చెప్పిన సమయం కంటే ముందుగానే, ఇంకా ఎక్కువ ఆర్థిక సహాయం చేస్తూ అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగు పెట్టుబడి కింద ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో ప్రతి రైతు కుటుంబానికి మొత్తం రూ.67,500 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు.

ఇప్పుడు దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకం వల్ల ప్రయోజనం కలుగుతోందని, వచ్చే నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించి మరో 14 లక్షల రైతుల కుటుంబాలకు పథకంలో మేలు చేస్తామని ప్రకటించారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన భూమి లేని కౌలు రైతులు మూడు లక్షల మంది ఉన్నారని చెప్పారు. దరఖాస్తు చేసుకునే రైతుల ఖాతాలను ప్రతి బుధవారం అప్‌డేట్‌ చేస్తూ, పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని తెలిపారు.

అందువల్ల రైతులు గ్రామ సచివాలయాలు, ఎమ్మార్వో కార్యాలయాలు, కలెక్టరేట్‌లు లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. బుధవారం ప్రపంచ ఆహార దినం సందర్భంగా ఒకరోజు ముందుగానే రైతులందరికీ మేలు చేసే ఈ ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు. 
గత ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ, రైతులకు సాగు పెట్టుబడి సహాయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభించింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, కాకుటూరులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఈ పథకం ప్రారంభించారు. రైతులకు సాగు పెట్టుబడిగా ఈ పథకంలో ఏటా రూ.13,500 సహాయం చేయనున్నారు.

తొలుత ఈ పథకాన్ని వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి అమలు చేయాలని నిర్ణయించినా, ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నారు. రైతులకు ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో రూ.2 వేల సహాయం చేసినందువల్ల ఇప్పుడు రూ.9500 వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. మిగిలిన రూ.2 వేలను సంక్రాంతి పండగ రోజున ఇస్తారు.

వచ్చే ఏడాది నుంచి ఈ పథకంలో భాగంగా ఖరీఫ్‌ సీజన్‌ (జూన్‌) ఆరంభంలో రూ.7500, రబీ సీజన్‌ (అక్టోబరు)లో రూ.4 వేలు, ఆ తర్వాత ధాన్యం ఇంటికి చేరే వేళ.. అంటే సంక్రాంతి పండగ సమయంలో మిగిలిన రూ.2 వేలు ఇస్తారు.
వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకంలో దాదాపు 54 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది.

ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన సర్వే ద్వారా ఈ పథకంలో 51 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన భూమి లేని 3 లక్షల కౌలు రైతు కుటుంబాలకు కూడా సహాయం చేయనున్నారు. ఈ కుటుంబాలన్నింటికీ ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.67,500 ఆర్థిక సహాయం అందనుంది.

 
గత ప్రభుత్వం ప్రజా సాధికార సర్వే ద్వారా 43 లక్షల రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించగా, ఇప్పుడు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకంలో 54 లక్షల రైతు కుటుంబాలకు వ్యవసాయ పెట్టుబడి సహాయం చేస్తోంది. 

విజయవాడ నుంచి నేరుగా రేణిగుంట చేరుకున్న సీఎం వైయస్‌ జగన్, అక్కణ్నుంచి హెలికాప్టర్‌ ద్వాకా కాకుటూరు వచ్చారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లతో పాటు, గ్రామ సచివాలయాన్ని కూడా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ సందర్శించారు. 

ఒక వైపు చిరు జల్లులు కురుస్తుండగా, ఒక పండగ వాతావరణంలో ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

ప్రతి ఒక్కరినీ పలకరింపు
అన్నా బాగున్నావా? అక్కా బాగున్నావా? వర్షాలు బాగా పడ్డాయా? సోమశిల నిండిందా? కండలేరుకు నీరు పోతుందా? అంటూ సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం ప్రారంభించడం అందరినీ ఆకట్టుకుంది.

 
ఇవాళ రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉన్నాయని, అందుకు ఎంతో సంతోషం ఉందని, దేవుడు ఆ విధంగా తమను కరుణిస్తున్నాడని సీఎం అన్నారు. గతంలో మహానేత వైయస్సార్‌ హయాంలో సోమశిల నిండిందని, మళ్లీ ఇవాళ 75 టీఎంసీల నీటి చేరికతో రిజర్వాయర్‌ నిండిందని చెప్పారు.

రైతు చరిత్ర మార్చే పథకం
ఒక రైతు బిడ్డగా నెల్లూరు వచ్చానని, ప్రతి రైతు చరిత్ర మార్చే గొప్ప పథకానికి ఇవాళ నాంది పలుకుతున్నామని, దేశంలోనే తొలిసారిగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ పథకం ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు.

బుధవారం ప్రపంచ ఆహార దినం సందర్భంగా, ఒకరోజు ముందుగానే ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతుందని చెప్పారు.

2014 తర్వాత దారుణస్థితి
‘2014 తర్వాత రాష్ట్రంలోని రైతులు చాలా నష్టపోయారు. ఆ పరిస్థితి మనమంతా చూశాం. 3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశాను. వారికి సున్నా వడ్డీ రుణాలు లేవు. చివరకు పావలా వడ్డీ కూడా అమలు కాలేదు.

బీమా ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అరకొర మాత్రమే. ధరల స్థిరీకరణ నిధి లేదు. ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి అంత కంటే లేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రాలేదు. పైగా చాలా చోట్ల వేలం వేశారు. ఇవన్నీ చూశాం. రైతులు ఆర్థిక భారం తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.


ఎక్కువ రైతులకు అతి తక్కువ భూమి
రాష్ట్రంలో 50 శాతం రైతులకు కేవలం అర హెక్టారు లోపు మాత్రమే భూమి ఉందని.. అంటే 1.25 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 50 శాతం ఉన్నారని, ఇక 2.50 ఎకరాల (హెక్టారు) భూమి ఉన్న రైతులు 70 శాతం ఉన్నారని సీఎం చెప్పారు.

నాడు ప్లీనరీలో చెప్పాను
2017, జూలై 8న మహానేత వైయస్సార్‌ జయంతి రోజు మంగళగిరిలో పార్టీ ప్లీనరీ సందర్భంగా రైతులకు ఒక మాట చెప్పానంటూ ఆ వీడియో ప్రదర్శించారు.

ఆ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఈ విషయం చెప్పారు.
‘5 ఎకరాల లోపు ఉన్న రైతులు, చిన్న, సన్నకారు, పేద రైతులకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తాము. ఏటా రూ.12,500 ఒకేసారి ఈ మొత్తం మే నెలలో ఇస్తాము. సాగు పెట్టుబడిగా ఆ సహాయం చేస్తాము. ఆ మొత్తం బ్యాంకులు రుణానికి జమ చేసుకోకుండా చర్యలు చేపడతాము. వైయస్సార్‌ భరోసా గా దాన్ని అమలు చేస్తాము’ అని చెప్పారు.

ఆ తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టానని, ఆ యాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశానని.. అందుకే ఒక బిడ్డగా, అన్నగా, తమ్ముడిగా ఉన్నానంటూ..  ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని చెప్పానని తెలిపారు.

వాగ్దానం–అమలు
అందుకే ఆ హామీని రైతు భరోసాగా అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నామని, ఆ హామీకి మరింత మెరుగులు దిద్ది, రెండు పేజీల మేనిఫెస్టోలో తొలి వాగ్ధానంగా ప్రకటించామని గుర్తు చేశారు. ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన దానికి మరింత మెరుగులు దిద్ది, సహాయం కూడా పెంచి ఈ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. 

ముందుగానే అమలు
అదే విధంగా గతంలో చెప్పిన దాని కంటే 8 నెలల ముందుగానే అమలు చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్‌ పంట వేసే సమయంలో, అంటే మే నెలలో రూ.7500, అక్టోబరులో రబీ అవసరాలు తీరేలా రూ.4 వేలు, ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండగ వేళ మరో రూ.2 వేలు ఇవ్వబోతున్నాయమని చెప్పారు.

ఇంకా ఎక్కువ మొత్తం
అంతే కాకుండా గతంలో చెప్పినట్లు రూ.12,500 కాకుండా మరో రూ.1000 పెంచి రూ.13,500 ఇవ్వబోతున్నామని, ఆ సహాయం కూడా నాలుగేళ్లకు కాకుండా 5 ఏళ్లు ఇవ్వబోతున్నామని, ఆ విధంగా ప్రతి రైతు కుటుంబానికి మొత్తం రూ.67,500 ఇవ్వబోతున్నామని చెప్పారు.

54 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం
గత ప్రభుత్వం సాధికార సర్వే ద్వారా 43 లక్షల రైతులను గుర్తించగా, ఈ ప్రభుత్వం పక్కా సర్వేతో 51 లక్షల రైతు కుటుంబాలను గుర్తించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో భూమి లేని నిరుపేదలైన కౌలు రైతులు 3 లక్షల మందికి కూడా ఈ పథకంలో సహాయం చేస్తున్నామని, ఆ విధంగా మొత్తం 54 లక్షల రైతుల కుటుంబాలకు మేలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 

మీ బిడ్డగా అడుగు ముందుకు
‘ఇప్పటికే గత జూన్‌లో రూ.2 వేలు మీకు సహాయంగా అందింది. ఇప్పుడు బటన్‌ నొక్కగానే మీ మీ ఖాతాల్లో రూ.9,500 వేలు జమ అవుతాయి. ఆ తర్వాత సంక్రాంతి పండగ సమయంలో మరో రూ.2 వేలు అందిస్తాము. చెప్పిన దాని కంటే ముందుగా, మాట ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఇస్తూ మీ బిడ్డగా అడుగు ముందుకేస్తున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. 

ఇవన్నీ ఇప్పటికే అమలు చేశాం
అధికారం చేపట్టగానే ప్రతి హామీ అమలు చేస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పగలే సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. 60 శాతం ఫీడర్ల ద్వారా ఈ సరఫరా జరుగుతుండగా, మిగిలిన ఫీడర్ల ద్వారా కూడా సరఫరా చేసేందుకు రూ.1700 కోట్లు కేటాయించామని, వచ్చే ఏడాది జూలై నాటికి ఆ 40 శాతం ఫీడర్ల నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్‌ సరఫరా అవుతుందని చెప్పారు.


పంటల బీమా కోసం 55 లక్షల రైతుల తరపున 56 లక్షల హెక్టార్ల భూమికి సంబంధించి రూ.2164 కోట్లు ప్రీమియమ్‌గా ప్రభుత్వం చెల్లిస్తోందని, రైతులు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఇంకా కౌలు రైతులకు కూడా భరోసా ఇచ్చే విధంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చట్టం చేశామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులకు సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు అందలేదన్న సీఎం, రూ.1.5 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నామని వివరించారు.

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నామని, 2019 ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 6.6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశామని, పొరుగు రాష్ట్రాలలో రైతులు యూరియా కోసం నానా ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ ఆ సమస్య లేదని చెప్పారు.

కరువులో రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశామని, ధాన్య సేకరణలో గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయి పెడితే, ఆ మొత్తాన్ని తీర్చేశామని, ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా దాదాపు రూ.2 వేల కోట్ల బకాయి ఉండగా, అది కూడా చెల్లించామని తెలిపారు.

శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలుకు రూ.1500 చొప్పున సహాయం చేశామని, పామాయిల్‌ రైతులకు రూ.87 కోట్లు ఇచ్చి అండగా నిల్చామని, రైతులు బలవన్మరణానికి పాల్పడితే వారికి వెంటనే రూ.7 లక్షల సహాయం చేస్తున్నామని, దాన్ని కలెక్టర్‌ స్వయంగా అందజేస్తున్నారని తెలిపారు.

ఇంకా రూ.770 కోట్లతో ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, ఆవులు, గేదెలు, మేకలు గొర్రెలు చనిపోతే బీమా పరిహారం ఇస్తున్నామని, వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశామని సీఎం వివరించారు. 

ఇంకా ఏమేం చేస్తాం?
రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు చేస్తామని.. గ్రామ సచివాలయం పక్కనే దుకాణం ఏర్పాటు చేసి, అందులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతామని, ఈ ఏడాదిలోనే ఇది జరగబోతోందని తెలిపారు. 

ఇంకా ప్రతి నియోజకవర్గంలో మ్యాపింగ్‌ చేసి, మండల కేంద్రాలలో కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తామని, రెండు మూడు మండలాలను యూనిట్‌గా చేసుకుని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.

జలయజ్ఞం
గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని అవితీనిమయం చేసిందని, అందుకే రివర్స్‌ టెండరింగ్‌ వి«ధానం తీసుకువచ్చామని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా పెండింగులో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు.

మీ రుణం ఎలా తీర్చుకోను?
నెల్లూరు జిల్లాలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇచ్చారని, అందువల్ల జిల్లా వాసులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని సీఎం అన్నారు. ఆందుకే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను నీటి పారుదల మంత్రిగా నియమించామని, ఆ విధంగా జిల్లాలో పెండింగులో ఉన్న అన్ని ప్రాజెక్టులు.. కండలేరు హైలెవెల్‌ కెనాల్, సర్వేపల్లి రిజర్వాయర్, పలు ఎత్తిపోతల పథకాలు.. వంటివన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ‘మీ బిడ్డ మీ రుణం కచ్చితంగా తీర్చుకుంటానని చేతులు జోడించి మనవి చేస్తున్నాను’ అని సీఎం అన్నారు.
 
ఇక ప్రతి బుధవారం..
‘ఇవాళ దాదాపు 40 లక్షల రైతుల కుటుంబాలకు ఇవాళ సహాయం అందుతోంది. మిగిలిన 14 లక్షల రైతుల కుటుంబాలకు కూడా ప్రతి బుధవారం నాడు, అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతా అప్‌డేట్‌ చేస్తూ రైతు భరోసా కింద సహాయం చేస్తాము.

నవంబరు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఎవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాలు, ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్‌ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరో రెండు రోజుల్లో సంబంధిత వెబ్‌సైట్‌ చేయబోతున్నాము’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకంలో అర్హులైన రైతుల వివరాలను గ్రామ సచివాలయాలు, ఎమ్మార్వో కార్యాలయాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. 
 
‘మీ బిడ్డ సీఎంగా అధికారం కోసం కాదు. మీ సేవ కోసం ఉన్నాడు. అందుకే వచ్చాడు. ఇది గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను’ అంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.
 
రూ.3785 కోట్ల చెక్కు
కాగా, అంతకు ముందు వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారులకు నగదు చెల్లింపు కోసం రూ.3785 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి విడుదల చేశారు. 

ఈనెల 13 వరకు నమోదైన దాదాపు 39 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.9,500 చొప్పున మొత్తం రూ.3785 కోట్లు జమ కాబోతున్నాయని, మిగిలిన వారందరికీ వచ్చే నెల 15 వరకు ఈ సహాయం అందుతుందని వివరించారు.

మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకతోటి సుచరిత, మేకపాటి గౌతమ్‌రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డితో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments