Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంలో కొత్త కాంతులను నింపే ఉగాది

Webdunia
WD
తెలుగువారి మొదటి పండుగ ఉగాది. దీనితో మన నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. ఇది మనకేకాక చాంద్రమానం అనుసరించే కన్నడీయులకు, మహారాష్ట్రులకు కూడా సంవత్సరాది. ఇది చైత్రశుద్ద పాడ్యమినాడు వస్తుంది.

నిజానికి ఉగాదికి యుగాది అనేది పేరు. యుగాది అంటే నూతన యుగానికి, నూతన కాలానికి ఆది అని అర్ధం. అయితే ఈ యుగాది క్రమంగా ఉగాది అని వాడుకలోకి వచ్చింది. కర్నాటకులు, మహారాష్ట్రులు దీనిని యుగాది అనే వ్యవహరిస్తారు. యుగం అంటే ఒక కాల విభాగము. వైశాఖ శుద్ద తృతీయనాడు కృతయుగము, కార్తిక శుద్ద నవమినాడు త్రేతాయుగము, భాద్రపద బహుళ త్రయోదశినాడు ద్వాపరయుగము, మాఘ బహుళ అమావాస్యనాడు కలియుగము ప్రారంభమవుతాయని, చంద్ర సూర్య గురువులకు కొన్ని నక్షత్రములతో సంబంధము కలిగినప్పుడు యుగాదులు ఏర్పడుతాయని విష్ణు పురాణ భారతాదులు చెపుతున్నాయి.

ఈ యుగాదులలో మానవులు పుణ్యస్నానం చేసి, భగవంతునికి పూజ చేసి, పేదలకు దానధర్మాలు చేసి, జప తపాదులు చేసి పుణ్యఫలం పొందాలని మహాభారతం చెబుతున్నది. ఇక ఈ సంవత్సరాది నిర్ణయమూ మన పురాణేతిహాసాలలో అనేక విధాలుగా ఉంది.

ఒకప్పుడు ఆశ్వయుజ పూర్ణిమ, ఆశ్వయుజ అమావాస్య, కార్తీక పూర్ణిమ, మార్గశిర సంక్రాంతి, పుష్య సంక్రాంతి, మాఘ పూర్ణిమ, మాఘ బహుళాష్టమి, వసంత పంచమి, పాల్గుణ పూర్ణిమ - హూలి పండుగ, చైత్రవుద్ద పాడ్యమి, వైశాఖ పూర్ణిమ- ఇలా పెక్కు విధాలుగా ఉంది. దీనికి కారణము ఋతు పరివర్తనము. వసంత కాలమున ప్రకృతిలో నవచైతన్యము మోసులెత్తుటను బట్టి, ఈ కాలమే నూతన సంవత్సరారంభమని పూర్వులు అభిప్రాయపడినారు.

క్రీస్తుశకం నాల్గవ శతాబ్దంలో ఉన్న జ్యోతిర్వేత్త వరాహమిహిరాచార్యుడు వసంత విషువత్కాలము వివిధ నక్షత్రములకు చలించి అశ్వినీ నక్షత్రాదిలో సంభవించుట గ్రహించి, మన ప్రాచీన దేవమానదిన ప్రారంభకాలమైన ఉత్తరాయణ పుణ్యకాలాదే వసంత కాలమని వసంత విషువత్కాలం నిర్ణయించి మాస ఋతు సామరస్యం సాధించి సంవత్సరాది వసంతకాలంలోనే అని నిర్ణయించినాడు. అప్పటి నుంచి చైత్రమాసమే సంవత్సరాదిగా పరిగణిస్తున్నాము.

చైత్రమాసంలో ఏదో ఒకనాడు ఈ పండుగ రాకూడదా, పాడ్యమినాడే ఎందుకు? అనే సంశయం కలుగవచ్చు. దీనికి కొంత చర్చ అవసరం. పూర్వము పూర్ణిమ నుంచి పూర్ణిమకు నెల లెక్కకట్టే ఆచారమూ ఉండేది. అమావాస్య నుంచి అమావాస్యకు నెల లెక్కకట్టడమూ ఉండేది. ఈ విషయముపై నిర్ణయ సింధుకారుడైన కమలాకరభట్టు చాలా చర్చించాడు. చంద్రగతితో నెల లెక్కపెట్టడం సులభం గనుక, అది అనాదిగా వున్నందున, శుక్ల పక్షాదితో నెల లెక్కపెట్టాలని నిర్ణయించాడు.

ఇంతేకాక భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో సూర్యుడు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమినాడు లంకా నగరంలో ఉదయించడం వల్ల, అనగా భూమధ్య రేఖపై ఉండడం వల్ల ఆనాడే యుగ, దిన, మాస, వర్షారంభం అవుతుందని నిర్ణయించాడు. ఇలాంటి నిర్ణయమయిన తర్వాత హేమాద్రి మొదలయిన వారు "బ్రహ్మ ఈ జగత్తును చైత్రమాసంలో శుక్ల పక్షంలో మొదటి దినాన, సూర్యోదయ వేళ సృష్టించినాడు. గ్రహ నక్షత్ర ఋతుమాస వర్ష వత్సరాధిపతులను ప్రవర్తింపజేనాడు'' అని ఆస్తికులకు బోధించినారు. పండుగ చేసుకొనే పద్ధతినీ వివరించినారు.

ఈ ఉగాది పండుగనాడు తెలుగువారు ఉషఃకాలంలోనే మంగళాభ్యంగ స్నానం చేసుకుంటారు. సంపన్నులైన వారు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇండ్ల తలవాకిలికి, తక్కిన వాకిళ్ళకు మామిడి ఆకుల తోరణాలు పూవుల తోరణాలు కడతారు. ఇంటి భవంతిని అలికి ముగ్గులు పెట్టి, మంటపం నిరిచి ఆ సంవత్సరం నూతన పంచాంగాన్ని ఆ సంవత్సరాధి దేవతను పూజిస్తారు. పిండివంటలను, ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదించి ఆరగిస్తారు.

ఉగాది పచ్చడికి ఉగాది గొజ్జు అని కూడా పేరు. వేపపూత, మామిడి ముక్కలు, కొత్తబెల్లం, కొత్త చింతపండు, పచ్చి మిరపకాయ ముక్కలు, ఉప్పు, గసగసాలు మొదలైన వాటిని కలిపి ఈ పచ్చడి సిద్ధపరుస్తారు. షడ్రసోపేతమైన ఈ రసాయనము సుఖదుఃఖమిళితమైన మానవుని సంవత్సర జీవితానికి ప్రతీక. సంవత్సరమంతా కలుగనున్న సుఖదఃఖాలను మానవుడు ఆనాడే చవిచూడడం ఆరంభిస్తాడని దీని భావం. దీనిలో నేయి కలపడం, మానవుడు సుఖదఃఖాలకు అంటకుండా వుండాలనడానికి సూచన. ఇలాంటి రసాయనం సేవించిన తర్వాత, అందరూ కలిసి భోజనం ఆరగిస్తారు.

భోజనానంతరం మూడు జాముల తర్వాత స్వగృహంలోనో, గ్రామ దేవాలయంలోనో, గ్రామం చావిడిలోనో జనమంతా చేరి పంచాంగశ్రవణం చేస్తారు. ఆ సంవత్సరం తమకు జరిగే యోగాలను, కందాయఫలాన్ని, ఆదాయవ్యయాలను, రాజపూజ, రాజావమానాలను పంచాంగం ద్వారా తెలుసుకొని, తదనుగుణంగా ప్రవర్తించడానికి ఆనాడే సంకల్పించుకొంటారు.

ధర్మ సింధు నిర్ణయం సింధు, భవిష్య పురాణము మొదలయిన ధర్మశాస్త్ర గ్రంథాలు "సంవత్సరారంభ దినం ఉదయం తలంటి పోసుకొని, నూతన సంవత్సరం నామకీర్తనం చేసి ప్రతి ఇంటిమీద ద్వజాలు పెట్టాలి. వేపాకు తినాలి. సంవత్సరాది ఫలం వినాలి. వసంత నవరాత్రం ప్రారంభించాలి'' అని శాసించినాయి. ఈనాడు ఇంద్రోత్సవం చేయాలని భారతం చెబుతున్నది. రామభక్తులు ఈ సంవత్సరాది నుంచే శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభించి, చైత్రశుద్ధ దశమినాడు పట్టాభిషేకంతో ముగిస్తారు. వీటిని రామ నవరాత్రోత్సవాలు అంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments