Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రంగస్థలం' మూవీ రివ్యూ ... సుక్కు 'మార్కు'కి చెర్రీ 'లెక్క'కి సరిపోయింది...(Video)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'రంగస్థలం'. మెగాస్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన చెర్రీ... తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (11:54 IST)
చిత్రం: రంగస్థలం
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌
నటీనటులు: రామ్‌చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, అనసూయ, నరేష్ తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
పాటలు: చంద్రబోస్‌
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని.. వై. రవిశంకర్‌.. మోహన్‌ చెరుకూరి
దర్శకత్వం: సుకుమార్‌
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'రంగస్థలం'. మెగాస్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన చెర్రీ... తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రమే "రంగస్థలం 1985". ఈ చిత్రానికి కె. సుకుమార్ దర్శకత్వం వహించాడు. విభిన్న శైలితో పాటు.. కొత్తదనం కలగలిపిన దర్శకుడు. నిజానికి ఈ చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1985లో 'రంగస్థలం' అనే గ్రామంలో జరిగిన రాజకీయ చదరంగం ఇతివృత్తంగా కథ సాగుతుంది. పైగా చరణ్‌ ఇందులో చెవిటివాడిగా నటించడం మరో విశేషం. ఈ చిత్ర కథ ఎలా ఉందో పరిశీలిద్ధాం. 
 
కథ : 
రంగస్థలం అనే గ్రామానికి సర్పంచ్ ఫణీంద్ర భూపతి(జగపతిబాబు). మూడు దశాబ్దాలుగా ప్రెసిడెంట్‌ పదవిలో ఉంటాడు. మరొకరికి అవకాశం ఇవ్వడు. ఆ గ్రామంలో అతను చెప్పిందే వేదం. అతని పేరు పలకడానికి కూడా జనం భయపడుతుంటారు. ప్రెసిడెంట్‌ ఇంటి ముందు నుంచి వెళ్లాలన్నా చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్లాల్సిందే. ఇదే గ్రామంలో పొలాలకు నీరు పెట్టే ఇంజిన్‌ను నడుపుతూ గ్రామమంతా అల్లరి చేసే కుర్రోడు చిట్టిబాబు(రామ్‌ చరణ్‌). పైగా అతడికి చెవుడు. గ్రామంలో అందరితోనూ సరదాగా ఉంటాడు. చిట్టిబాబు తండ్రి నరేష్. గ్రామంలో ఓ దర్జీ. అన్న కుమార్‌బాబు(ఆది) చదువుకుని దుబాయ్‌లో ఉద్యోగం చేసి గ్రామానికి వస్తాడు. 
 
అదే ఊరిలో ఉండే రామలక్ష్మి(సమంత)కి చిట్టిబాబు అంటే ఎంతో ఇష్టం. గ్రామంలోని అమాయక రైతులను తన సహాయకుడితో కలిసి ఫణీంద్రభూపతి మోసం చేస్తూ ఉంటాడు. అలా రామలక్ష్మి(సమంత) తండ్రిని మోసం చేసి డబ్బు కట్టాల్సిందిగా ఆదేశిస్తాడు. ఈ విషయంలో కుమార్‌బాబుకి ప్రెసిడెంట్‌ సహాయకుడికి మధ్య గొడవ జరుగుతుంది. మరి ఆ గొడవ దేనికి కారణమైంది? ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? ఈ గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో కుమార్‌బాబు ఎందుకు నామినేషన్‌ వేయాల్సి వచ్చింది? తన అన్నకు అండగా నిలిచిన చిట్టిబాబు ఏం చేశాడు? అన్నదే మిగిలిన కథ. 
 
విశ్లేషణ : 
ఈ చిత్రం కథమొత్తం 1985నాటికాలంలో సాగుతుంది. భూస్వామ్య వ్యవస్థ.. ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉండటం.. 30 ఏళ్లుగా గ్రామాన్ని పాలిస్తున్న ఓ సర్పంచ్ చేసే అరాచకాలను నిలదేసే ఓ యువకుడు.. ఇదీ స్థూలంగా రంగస్థలం నేపథ్యం. ఈ తరహా కథలు గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ, ఇలాంటి కథకు సుకుమార్‌ శైలిని జోడిస్తే ఎలా ఉంటుందో అదే 'రంగస్థలం'. కథపరంగా పాత్రల ఎంపిక, వాటిని చిత్రీకరించిన విధానం, ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో కథ మొత్తం సాగుతుంది. 
 
ప్రథమార్ధమంతా ఊళ్లో చిట్టిబాబు చేసే సందడి.. రామలక్ష్మితో వచ్చే సరదా సన్నివేశాలతో ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తూ సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా రామలక్ష్మిగా సమంత నటన ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులుపూయిస్తాయి. పాటలు కూడా సన్నివేశాలకు ఉన్నాయి. మరోపక్క గ్రామంలో ప్రెసిడెంట్‌ చేసే అన్యాయాలను కుమార్‌బాబు నిలదీయడంతో పాటు, సర్పంచ్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అయితే ఈ పరిణామాలేవీ చిట్టిబాబుకు తెలియవు. తన తండ్రి, అన్నను ప్రెసిడెంట్‌ అవమానించాడన్న విషయం తెలుసుకున్న తర్వత చిట్టిబాబు ఎలా స్పందించాడన్నదే ద్వితీయార్థం సినిమా. 
 
కుమార్‌బాబు నామినేషన్‌ వేయడం, ప్రెసిడెంట్‌ అరాచకాలను ఊరి వాళ్లకు తెలియజేయడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు తదితర సన్నివేశాలతో రెండోభాగంలో చూపించాడు. అక్కడి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని ఆశ్చర్య పరుస్తాయి. రంగమ్మత్తగా అనసూయ ఓ ట్విస్ట్‌ ఇస్తుంది. కుమార్‌బాబుపై దాడి జరగడం ఆ తర్వాత పరిణామాలు కథకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఇక చివర్లో ఎవరూ ఊహించని విధంగా ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చే షాక్‌ ప్రేక్షకులను మరింత ఆశ్చర్య పరుస్తుంది. ఇలా ద్వితీయార్థం మొత్తం సుకుమార్‌ శైలి ట్విస్ట్‌లతో సాగుతుంది.
 
పాత్రల తీరు తెన్నులు : 
చిట్టిబాబుగా చెర్రీ ఒదిగిపోయారు. గోదావరి యాస.. చెవిటి వ్యక్తిగా అతను పండించే నవ్వులు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటివరకూ చరణ్‌ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర మరో ఎత్తు. చెవిటి వ్యక్తిగా ప్రియురాలి వద్ద తడబడే సన్నివేశాల్లో నవ్వులు పంచిన చెర్రీ ద్వితీయార్థంలో అన్నకోసం తపన పడే తమ్ముడిగా భావోద్వేగాలను పలికించడంలో పూర్తి మార్కులు కొట్టేశాడు. ఇక సమంత రామలక్ష్మిగా తన నటనతో మరోసారి కట్టిపడేసింది. సుకుమార్‌ చిత్రాల్లో కథానాయిక పాత్ర బలంగా ఉంటుంది. ఈ చిత్రంలో సమంత పాత్ర చాలా కీలకం. పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. కుమార్‌బాబు పాత్రలో ఆది పినిశెట్టి ఇమిడిపోయారు. మృదు స్వభావిగా.. గొడవలకు దూరంగా ఉంటూనే అన్యాయంపై పోరాటం చేసే వ్యక్తిగా చక్కగా నటించారు. 
 
ఇకపోతే, గ్రామ సర్పంచ్‌గా జగపతిబాబు, ఎమ్మెల్యేగా ప్రకాశ్‌రాజ్‌ ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. సినిమాలో రంగమ్మత్తగా అనసూయ పాత్ర ఓ ట్విస్ట్‌. సుకుమార్‌ ఎంపికకు ఆమె న్యాయం చేశారు. ఆ పాత్రలో చక్కగా నటించారు. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. సుకుమార్‌-దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌ హిట్‌ అని మరోసారి 'రంగస్థలం' నిరూపించింది. సుకుమార్‌-దేవిల మార్కు ఐటమ్‌సాంగ్‌లో పూజా హెగ్డే అలరిస్తుంది. రామ్‌-లక్ష్మణ్‌ పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
 
ఇక 'రంగస్థలం' కెప్టెన్‌ సుకుమార్‌ 'లెక్క' అదిరిపోయింది. ప్రతీ సన్నివేశంలోనూ ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రలను ఎంపిక చేసుకున్న విధానం, వాటిని తీర్చిదిద్దిన తీరులో సుక్కు 'మార్కు' కనపడుతుంది. మొత్తం 24 క్రాఫ్ట్స్‌ను సమర్థంగా ఒకే తాటి పైకి తీసుకొచ్చారు దర్శకుడు. తాను అనుకున్న కథను తెరపై తీసుకొచ్చి, మనల్ని కూడా 'రంగస్థలం'లోకి తీసుకెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments