రెండు బస్సులు వ్యతిరేకదిశలో ప్రయాణం సాగుతాయి. అలా ఒక్కచోట వచ్చేసరికి మితిమీరిన వేగంతో ఈ రెండు బస్సులు గుద్దుకోవడంతో ప్రయాణికులు చాలామంది చనిపోతారు. కొందరికి తీవ్ర గాయాలవుతాయి. తన కళ్ళముందే జై చనిపోవడం, తను చూస్తుండగానే అంజలికి విపరీతగాయాలు కావడం అనన్య, శర్వానంద్‌లు షాక్‌కు గురవుతారు. ఆ తర్వాత ఎవరికి వారు తమవారిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇదీ కథ.
ఇందులో పాత్రధారుల కంటే పాత్రలే కన్పిస్తాయి. ఎవరూ నటించినట్లు ఉండదు. దర్శకుడు స్క్రీన్‌ప్లే చూపించడంలో తగిన శ్రద్ధతీసుకున్నాడు. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కోపతాపాలు, అనుమానాలు, ప్రవర్తనలు ఇరు జంటల మధ్య బాగా చూపించాడు. సంభాషణలు పొందికగా ఉన్నాయి. క్యాచీగా కూడా ఉన్నాయి. సినిమా ఎక్కువభాగం బస్ ప్రయాణంలోనే సాగుతుంది. కనబడిన వారెవరూ మంచివారుకాదనే అమాయకురాలిగా అంజలి బాగా చేసింది.
ఇప్పటి జనరేషన్‌లో ఇటువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అన్నంత ఆశ్చర్యంలోనూ ఆమెతో ప్రేమలోపడే శర్వానంద్ సూటయ్యాడు. వీరిద్దరి వ్యతిరేకమైన మరో జంట జై, అనన్య. నర్సుగా చేస్తూ తన ప్రేమపై ఒక అవగాహన గల ఈనాటి ఫాస్ట్ యువతిగా అనన్య బాగా నటించింది. ఒట్టి అమాకుడిగా జై సరిపోయాడు.
దర్శకుడు ఎంచుకున్న భిన్న ప్రేమకథలో లాజిక్కు ఉంది. యువతను బాగా కట్టిపడేస్తుంది. బస్ ప్రయాణంలో పయనించే భిన్నరకాల వ్యక్తులు, వారి మనస్తత్వాలు, వారి ఆలోచనలు చాలా సహజంగా ఉన్నాయి. కామెడీ అంటూ ప్రత్యేకంగా ఏమీలేకుండా క్యారెక్టర్ల చేత రన్నింగ్‌లో కామెడీ చేయించడం విశేషం.
సంగీతపరంగా పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. డిజిటల్ ఫార్మెట్‌లో తీసిన ఈ చిత్రం లొకేషన్ల అనుగుణంగా బాగా తీశారు. పతాక సన్నివేశాలు హృదయాన్ని పిండేస్తాయి. ప్రేమకథలు చెబుతూ... అందులోనూ జీవితాన్ని చూపించిన ప్రయత్నమే ఈ జర్నీ. ప్రతి ప్రాంతంలోనూ ఒకేచోట ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఊహకందనిది.
అటువంటి ప్రాంతమే.. చెన్నై టు తిరుచ్చీ వెళ్ళేరహదారి.. అక్కడే నెలకు ఆరు ఏక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఆ ప్రాంతాన్ని దర్శకుడు ఎంచుకుని సినిమాగా తీశాడు. ఇప్పుడు అక్కడే ఆసుపత్రి కూడా కట్టడం విశేషం. చివరగా... మంచి ఫీల్ ఉన్న ఈ సినిమా.. ప్రేమికుల్నిచంపేసి విషాదమైన ముగింపు తమిళ ప్రజలకు నచ్చుతుంది. మరి తెలుగు ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి.