'సారంగపాణి జాతకం'లో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ 'సారంగో సారంగా', 'సంచారి సంచారీ' పాటలు ట్రెండ్ అవుతుండగా, టీజర్‌లోని మాటలు, హాస్య సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
చిత్రం గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... ''ఫస్ట్ కాపీతో సహా 'సారంగపాణి జాతకం' సినిమా రెడీ అయ్యింది. త్వరలో సెన్సార్ పూర్తి చేస్తాం. ఏప్రిల్ 18న థియేటర్లలోకి సినిమాను తీసుకొస్తున్నాం. వేసవిలో హాయిగా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే చిత్రమిది. మా దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఇటీవల విడుదలైన టీజర్ లో ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో పరిచయం చేశాం. ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది'' అని అన్నారు.
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిలది సూపర్ హిట్ కాంబినేషన్. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత వాళ్లిద్దరి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించారు. వేసవిలో థియేటర్లలో వినోదాలు పంచేందుకు ఈ సినిమా సిద్ధమైంది. ఏప్రిల్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.