'ఉప్పెన' హీరోయిన్ కృతిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె బస చేసిన హోటల్లో ఆత్మ కనిపించినట్టు చెప్పారు. ఈ వింత అనుభవంపై ఆమె స్పందిస్తూ, తాను నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూసినట్టు చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నపుడు ఒక ఆత్మ రూపాన్ని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు అని అన్నారు.
తాను తుళు సంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిని. మేము, మా పూర్వీకులను దేవతలను పూజిస్తాం. వారు ఎప్పుడూ మమ్మలను కాపాడుతూ ఉంటారని నమ్ముతాం. ఇపుడు ఈ ఘటనతో ఆ నమ్మకం మరింత బలపడింది అని చెప్పారు. ఈ అనుభవం వల్ల సినిమాలో తాను పోషిస్తున్న పాత్రపై మరింత నమ్మకం కలిగిందని, నటనలో అది తనకు బాగా ఉపయోగపడిందని కృతిశెట్టి అన్నారు.
కాగా, తమిళం కార్తి హీరోగా నటించే వా వాత్తియార్ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. నలన్ కుమారస్వామి దర్శకుడు.