తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. అలాగే, అపార నష్టం వాటిల్లింది. ఈ వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. వరద ముప్పు కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే, తక్షణ సాయం కింద రూ.550 కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా రూ.50 లక్షల విరాళం అందించేందుకు ముందుకు వచ్చారు.
భారీ వర్షాలు, వరదల వలన హైదరాబాద్ నగర ప్రజల జీవితం దుర్భరంగా మారింది. వారి బాగోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.550 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. ఈ విపత్తు వలన నిరాశ్రయులైన వారికి నా వంతు సాయంగా రూ.50 లక్షల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నాను అని నాగార్జున పేర్కొన్నారు.
అలాగే, టాలీవుడ్ కుర్రహీరో విజయ్ దేవరకొండ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. గతంలో కేరళ, చెన్నై నగరాల్లో వరదలు సంభవించినపుడు మనమంతా ఒక్కటిగా నిలిచామని, ఇపుడు హైదరాబాద్ నగరాన్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.
Heavy rains and floods have devastated the life of people in Hyderabad. Appreciate the efforts of Telangana Govt in releasing 550 crores for immediate relief. Standing by the cause, will contribute 50 lakhs to Telangana CM relief fund.#TelanganaCMO