కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జానపద గాయకుడు మొగిలయ్య కన్నుమూశారు. తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన మొగిలయ్య.. బలగం సినిమాతో గుర్తింపు పొందారు. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో ఆయన ఆలపించిన పాట భావోద్వేగాలను కలగజేసి, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ పాటతో ఆయన పేరు ప్రేక్షక లోకానికి పరిచయమైంది. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్యకు సినీ ప్రముఖులు చిరంజీవి, దర్శకుడు వేణు చేయూత అందించారు.
కుటుంబ సభ్యుల నిరంతర కృషి, వైద్యుల శ్రద్ధ కలిసొచ్చినా, దురదృష్టవశాత్తూ ఆయన మరణం చోటుచేసుకుంది. మొగిలయ్య అకాల మరణం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల, పొన్నం సత్య అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా, మంత్రి పొన్నం ప్రభాకర్, మొగిలయ్య కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇస్తుందని, అలాగే అన్ని వైద్య ఖర్చులను భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు.