దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ నటుడిగా విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం 101 జిల్లాల అందగాడు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదలవుతుంది.
ఈ క్రమంలో బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను వరుణ్ తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ట్రైలర్ గమనిస్తే, పెళ్లి చేసుకోవాల్సిన వయసులోని యువకుడికి బట్టతల వచ్చినప్పుడు అతనెలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు.. తన సమస్యను దాచి పెట్టడానికి తన ప్రేయసి దగ్గర తనకు బట్టతల ఉందనే నిజం తెలియనీయకుండా అతను పడే ఇబ్బందులతో పాటు ఓ ఎమోషనల్ కోణంలో సినిమా ఉంటుందని అర్థమవుతుంది.
నాన్నగారిది బట్టతల అయినా మీకు జుట్టు భలే ఉంది బాబు అని సెలూన్ నడిపే వ్యక్తి హీరో అవసరాల శ్రీనివాస్‌తో అంటే.. జస్ట్ మెయిన్‌టెనెన్స్ అంటూ తను బదులివ్వడం, హీరోయిన్ రుహానీ శర్మకు తెలుగు రాదని తెలిసిన హీరో అవసరాల, ఆమెకు ముందే బాయ్‌ఫ్రెండ్ ఉండి ఉంటాడని పాట రూపంలో చెప్పడం.. దానికి ఆమె ఈ పాట హిందీలో కూడా ఉందిగా అని చెప్పడం తన బట్టతను సెలూన్‌లో పనిచేసే వ్యక్తికి చూపించి సైడ్స్ మాత్రమే ట్రిమ్ చేయమంటే వాడు షాక్ అవడం,
హీరోయిన్ ఇంటికి వెళ్లినప్పుడు బట్టతల కనపడనీయకుండా పెట్టుకున్న విగ్ ఊడిపోయినప్పుడు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడటం
చివరగా.. ఏ జుట్టు దువ్వుకుంటే పళ్లు రాలుతాయని దువ్వెనలు సైతం భయపడతాయో.. ఏ జుట్టు ముడేస్తే కొండలు సైతం కదులుతాయో, అలాంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టిచ్చి నన్నీ కేశ దారిద్య్రం నుంచి బయటపడేయి తండ్రీ అంటూ కనపడిన దేవుడిని వరం కోరుకునే కామెడీ డైలాగ్‌తో ట్రైలర్ కంప్లీట్ అయ్యింది.
సినిమాలో కావాల్సినంత కామెడీ, ఎమోషన్స్ ఉన్నాయనే సంగతిని ట్రైలర్ ద్వారా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. రామ్ సినిమాటోగ్రఫీ, శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు.