ఓ పరిశ్రమపై దాడి కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కింది కోర్టు విధించిన జైలు శిక్ష వ్యవహారంలో సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. గత 2014లో ఓ పరిశ్రమపై దాడి కేసులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పును ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు పంపించింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిక్కుల్లోపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, గతంలో పటాన్‌చెరు సమీపంలోని ఓ పరిశ్రమపై దాడి చేసిన కేసులో మహిపాల్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు రెండున్నరేళ్ల జైలుశిక్షతో పాటు 2500 రూపాయల అపరాధం కూడా విధించింది. ఈ తీర్పుపై మహిపాల్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేయగా, స్టే విధించింది. అప్పటి నుంచి ఈ కేసులో స్టే కొనసాగుతూనేవుంది.