హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, ఏడు జిల్లాలకు రెడ్ హెచ్చరికలు, 17 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 9 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. దీంతో రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట్, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్ రోడ్, హస్తినాపురం, సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం వర్షం జోరుగా కురుస్తోంది.
అనేక ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి పడుతూనే ఉంది. వర్షం ధాటికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నేడు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాటిలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.