Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలని చెప్పి ఇప్పుడు మోసం చేసాడు కేసీఆర్: పాదయాత్రలో షర్మిల

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:57 IST)
వైఎస్ షర్మిల 18వ రోజు ప్రస్థానం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..."టీఆర్ఎస్, బీజేపీల‌ను న‌మ్మి ఓట్లు వేస్తే గ్యాస్ ధరలు పెంచారు. కరెంట్ చార్జీలు పెంచారు. పిల్ల‌ల స్కూల్  ఫీజులు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్ మెంట్ రాక ఇబ్బందులు ప‌డుతున్నారు. రూ.35వేల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ కూడా ఇవ్వ‌డం లేదు.

కూలీనాలీ చేసి కష్టపడి ఉన్న‌త చ‌దువులు చదివిస్తే, పత్తి ఏరడానికి వెళ్తున్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు వేయ‌క‌పోవ‌డంతో హమాలీ పని చేసుకుంటున్నారు. కొంత‌మంది నిరుద్యోగులు ఆటోలు నడుపుకుంటున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు తల్లిదండ్రులకు భారం కాలేక ప్రాణాలు విడుస్తున్నారు. దీనికి కారణం ముమ్మాటికీ కేసీఆర్. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. 
 
హుజూరాబాద్ లో ఒక్క ఓటుకు రూ.10,000 ఇచ్చాడంటే కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడ్డారో తెలుస్తోంది. కేసీఆర్‌ ప్రాజెక్టుల పేరుతో కోట్లు వెనకేసుకున్నాడు. ధరణి పేరుతో ఖాళీ జాగాలన్నీ కబ్జా పెడుతున్నారు. పాసుబుక్కులు ఉన్నా కూడా టీఆర్ఎస్ నాయకులు బెదిరించి భూములు లాక్కుంటున్నారు. ప‌రిపాలించే ప్రభుత్వంలోనే దొంగలు ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి.

అసైన్డ్ భూములు, పోడు భూములు ఇలా ఎక్క‌డ‌ ఖాళీ భూములు కనిపిస్తే వాటిని కబ్జా పెడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ ఆక్రమించుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకపోతే రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలని అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవన్నీ హామీలు ఎక్కడ పోయాయి? 
 
కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు. పాత పెన్షన్లు తొలగిస్తున్నారు. పేద ప్ర‌జ‌ల‌కు తెల్ల రేషన్ కార్డులు రావడం లేదు. వైఎస్ఆర్ గారు ఉంటే ఈ సమయానికి డిండి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది. ప్రతి గ్రామానికి మంచినీళ్లు ఇవ్వాలని వైయ‌స్ఆర్ గారు డిండి ప్రాజెక్టును ప్రారంభించారు. 80 శాతం పనులు కూడా చేశారు. నేటి పాలకులు మిగిలిన 20 శాతం పనులు కూడా పూర్తి చేయడం లేదు. ప్రతిపక్షాలు సైతం ప్ర‌జ‌ల  పక్షాన నిల‌బ‌డి ప్రశ్నించడం లేదు.

కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంతా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన‌ కాంగ్రెస్ లీడర్లు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేక‌పోవ‌డంతో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేస్తున్నాడు.

ప్రతిపక్షాలు, పాలకపక్షం ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయడం లేదు. పెద్దపెద్ద గడీలు కట్టుకొని బతుకుతున్న పాల‌కులు పేద‌ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డంలేదు. 
 
నిరుద్యోగులు వందల మంది ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 8 వేలమంది రైతులు చనిపోతే కేసీఆర్, అతని కుటుంబం పట్టించుకోకుండా భోగాలు అనుభవిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన కేసీఆర్ కుటుంబసభ్యులకు ఉద్యోగాలు కావాలి కానీ డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం బర్లు, గొర్లు ఇస్తారట.

నిరుద్యోగులు హమాలీ పని చేసుకోవాలని బుద్ధిలేని మినిస్టర్ అంటున్నాడు. పిల్ల‌ల్ని వారి త‌ల్లిదండ్రులు ఎంతో క‌ష్ట‌ప‌డి ఉన్నత చ‌దువులు చ‌దివించారు.  హమాలీ పని చేసుకోవడానికే డిగ్రీలు, పీజీలు చదివారా? ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మార్కెట్ ధ‌ర రూ.40 లక్షలు ఉంటే నాలుగు లక్షల పరిహారం ఇస్తున్నారు. ఇది దోపిడీ కాదా?

అన్యాయంగా దోచుకోవడం కాదా? అధికారం ఉంది కదా అని పోలీసులు, అధికారులతో బలవంతంగా భూములు లాక్కుంటారా? అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి పనులు చేయొచ్చా? ప్రజలు తమ కష్టాలతో గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. 
 
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పాలన చేశారో ప్రజలకు తెలియనిది కాదు. ఆ మ‌హానేత ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి, పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించారు.

108 సేవలు ప్రవేశపెట్టి, 20 నిమిషాల్లో ఇంటి వద్దకే అంబులెన్స్ వచ్చేలా చేశారు. ఐదేండ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 45లక్షల ఇండ్లు నిర్మిస్తే.. వైయస్ఆర్ గారు ఒక్కరే రాష్ట్రంలో 46లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని మొట్టమొదటి ఆలోచన చేసిందే వైయస్ఆర్.

మహిళలకు పావ‌లా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేదింటి పిల్లలకు ఉన్నత విద్య అందించారు. ఎంతోమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. వైయస్ఆర్ అన్ని సంక్షేమ పథకాలను అద్భుతంగా నడిపించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.

ఐదేండ్ల కాలంలో నిరుద్యోగుల కోసం మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇవే కాక ప్రైవేటు రంగంలో 11లక్షల ఉద్యోగాలను సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించారు.

ఐదేండ్లలో ఒక్క పన్ను పెంచకుండా పాలన సాగించిన రికార్డు ముఖ్యమంత్రి మన వైయస్ఆర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వైయస్ఆర్ గారు చేసి, చూపించారు. వైయస్ఆర్ ఎప్పుడూ పేద పిల్లల గురించే ఆలోచించేవారు. 
 
వైయ‌స్ఆర్ హ‌యాంలో గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగితే ఆ భారం ప్రజల మీద పడకూడదని ప్రభుత్వమే భరించేలా చేశారు. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే దానికి కారణం టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలే. అడ్డ‌గోలుగా ప‌న్నులు వసూలు చేస్తూ ప్రజల మీద భారం వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క ఏడాదిలోనే 30 రూపాయలు పెరిగింది.

కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలనే ఆలోచనే చేయడం లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. మాట తప్పడం తప్పితే మాట మీద నిలబడాలి అన్న విజ్ఞత కూడా లేదు. కేసీఆర్‌ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దు.

కేసీఆర్ గారడీ మాటలు ఎంత తియ్యగా ఉంటాయంటే గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించగలడు. కేసీఆర్ కు ఓటేస్తే మన బతుకులు మళ్ళీ ఇలాగే స‌మ‌స్య‌ల్లో ఉంటాయి. ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ కు అధికారం అప్ప‌గించి మోసపోయాం. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ కు ఓటేస్తే రాష్ట్రాన్ని నట్టేట ముంచాడు. నాలుగు లక్షల కోట్ల రూపాయ‌ల అప్పు చేశాడు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయినట్టు?

కేసీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడి, డబ్బులు దోచుకొని ఆ డబ్బులతో ఈరోజు ఓట్లు కొంటున్నాడు. మళ్లీ మళ్లీ మోసపోకండి. ప్రజల కోసం పెట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌ తెలంగాణ పార్టీ. ప్రజల అభివృద్ధి కోసం పెట్టాం. వైయ‌స్ఆర్‌ బిడ్డగా మీకు మాటిస్తున్నాను.. నా ప్రజలకు తుది శ్వాస వరకు సేవ చేస్తా... సంక్షేమం, అభివృద్ధి మాకు రెండు కళ్ల‌ లాంటివి. వైయస్ఆర్‌ తెలంగాణ పార్టీకి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే, మమ్మల్ని గెలిపిస్తే వైయ‌స్ఆర్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తా" అన్నారు.
 
స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టిన ప్ర‌జ‌లు..
ప్ర‌జాప్ర‌స్థానంలో భాగంగా నిర్వ‌హించిన మాట ముచ్చ‌ట‌లో ప్ర‌జ‌లు ఏక‌రువు పెట్టారు. పించ‌న్లు రావ‌డం లేదని, ఇండ్లు లేవ‌ని కంట‌త‌డి పెట్టారు. డిగ్రీలు, పీజీలు చేసినా ఖాళీగా ఉంటున్నామ‌ని నిరుద్యోగులు ఆవేద‌న చెందారు. పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివి ప‌త్తి ఏర‌డానికి పోతున్నామ‌ని కన్నీటి ప‌ర్యంతం అయ్యారు.

కేసీఆర్ ను న‌మ్మి ఓటేస్తే న‌ట్టేట ముంచాడ‌ని మండిప‌డ్డారు. గ్యాస్, పెట్రోల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెంచార‌ని పేర్కొన్నారు. స‌రైనా కాగితాలు ఉన్నా ప‌ట్టాలు రావ‌డం లేద‌ని ఆరోపించారు. ధ‌ర‌ణి పేరుతో ముప్పుతిప్పులు పెడుతున్నార‌ని వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments