మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహ సంస్కృతికి రోజు రోజుకీ గౌరవం దగ్గిపోతోంది. వివాహేతర సంబంధాల కారణంగా పెళ్లి వ్యవస్థపై నమ్మకం తగ్గిపోతోంది. అక్రమ సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా పెళ్లికి ఒక్కరోజు ముందు యువతి అదృశ్యమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. సుజాతనగర్ మండల కేంద్రంలోని సిరిపురం ప్రాంతానికి చెందిన యువతి (22) స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఆమె తండ్రి కొంతకాలం క్రితం చనిపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో టేకులపల్లి మండలానికి చెందిన యువకుడితో ఆమెకు ఇటీవల కులాంతర వివాహం కుదిరింది. శుక్రవారం బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
గురువారం ఉదయం బయటకు వెళ్లిన వధువు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి సుజాతనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీతంపేట బంజరకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా ప్రేమ పేరుతో తన కూతుర్ని వేధిస్తున్నాడని, ఆమెకు మాయమాటలు చెప్పి అతనే ఎటో తీసుకెళ్లి ఉంటాడని' ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అతడికి గతంలోనే వివాహమైనట్లు పొలీసులు తెలిపారు. యువతి దుకాణానికి వెళ్లొచ్చే క్రమంలోనే అతడు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించినట్లు తెలుస్తోంది.