హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆన్‌లైన్ వేదికగా సొంత నగ్న వీడియోలను చిత్రీకరించి, వాటిని డబ్బులకు విక్రయిస్తున్న దంపతుల జంటను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సమాజంలో నైతిక విలువలకు తూట్లు పొడుస్తూ సాగుతున్న ఈ అశ్లీల దందా స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. అంబర్‌పేటకు చెందిన దంపతులకు కొంతకాలంగా ఆన్‌లైన్‌లో తమ నగ్న వీడియోలను స్ట్రీమింగ్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. డబ్బులు చెల్లించిన వారికి ప్రత్యేకంగా స్ట్రీమింగ్ లింకులను, వీడియోలను షేర్ చేస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్ధారించారు. ఇలా పక్కా ఆధారాలను సేకరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు... వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుల నివాసంపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దందా కోసం ఉపయోగిస్తున్న కెమెరా, లైవ్ లింక్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన దంపతులను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ దందా వెనుక ఎవరైనా ఉన్నారా? ఎంతకాలంగా ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ వర్గాలు తెలిపాయి.