Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సన్నిధి గొల్ల' మొరను శ్రీవారు ఆలకించారా? సానుకూలంగా తితిదే నిర్ణయం..

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (12:40 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సన్నిధి గొల్ల వెంకట్రామయ్యను ఉద్యోగ విరమణ అనంతరం కొనసాగించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. దీనిపై తితిదే సాంబశివరావు ఒక నిర్ణయాన్ని వెలువరించారు. అయితే తితిదే నిర్ణయం ఎలా ఉన్నా ప్రభుత్వ నిర్ణయమే ఇందులో కీలకం.
 
ఎన్నోయేళ్లుగా శ్రీవారి ఆలయాన్ని మొదటగా తెరిచి స్వామివారిని మొట్టమొదటగా దర్శించుకుంటున్నారు సన్నిధి గొల్లలు. అలాంటి సన్నిధి గొల్ల వెంకట్రామయ్య పదవీ కాలం ఈనెల చివరికి ముగియనుంది. తితిదే నిబంధనల ప్రకారం 65 సంవత్సరాలకే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అలాంటిది పదవీ విరమణ ఎందుకు చేయాలన్న ప్రశ్న తలెత్తింది. సన్నిధి గొల్ల వెంకట్రామయ్యతో పాటు మొత్తం యాదవులందరూ ఐక్యమై తితిదే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తితిదే ఈఓ దృష్టికి ఇదే విషయాన్ని పలు సార్లు తీసుకెళ్లారు. యాదవ కులానికి చెందిన వెంకట్రామయ్యను విధుల నుంచి పూర్తిగా పంపించాలన్న నిర్ణయం తీసుకుంటే మాత్రం ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
 
యాదవుల ఆందోళనో లేక వెంకట్రామయ్య శ్రీవారికి పెట్టుకున్న మొరో మొత్తం మీద చివరకు కథ సుఖాంతమైంది. ఈనెల 30వతేదీన వెంకట్రామయ్య పదవీ విరమణ చేస్తారని, ఇదే విషయంపై ప్రభుత్వానికి నివేదిక పంపి ఆయన్ను కొనసాగించాలన్న నిర్ణయాన్ని వ్యక్తపరుస్తామని ఈఓ చెప్పారు. 
 
తితిదే తీసుకున్న నిర్ణయంపై వెంకట్రామయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వెంకట్రామయ్యను సన్నిధి గొల్లగానే కొనసాగిస్తారా లేక వేరే ఏదైనా పదవి అప్పజెబుతారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో వెంకట్రామయ్య ఏ పదవిని చేపడతారో తెలిసిపోనుంది. ఇందుకోసం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. 

తిరుమల సన్నిధి గొల్ల వివాదమిదే... 
తిరుమల శ్రీవారి ఆలయంలో మొదటి దర్శన భాగ్యం వారిదే. కానీ ఇప్పుడు తితిదే నిర్ణయంతో అసలు దర్శన భాగ్యమే లేకుండా పోతోంది ఆ కుటుంబానికి. వారే తరతరాలుగా శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచే సన్నిధి గొల్ల కుటుంబీకులు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం సుప్రభాత సేవకు అర్చకులను తోడ్కొని వచ్చేది సన్నిధి గొల్ల కుటుంబీకులే. వంశపారపర్యంగా కొనసాగుతున్న సంప్రదాయానికి చెక్‌ పెట్టేలా తితిదే వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సన్నిధి గొల్ల కుటుంబీకులు.
 
తితిదేలో మరో వివాదం మొదలైంది. శ్రీవారి ఆలయంలో వంశపారపర్యంగా సేవలందిస్తున్న సన్నిధి గొల్లలను సాగనంపే దిశగా అడుగులు వేస్తోంది తితిదే. దీంతో ఎన్నో యేళ్ళుగా శ్రీవారి ఆలయంలో మొదట దర్శన భాగ్యం చేసుకుంటున్న తమ కుటుంబానికి తితిదే అన్యాయం చేస్తోందని వాపోతున్నారు సన్నిధి గొల్ల వంశీయులు. ఈ వివాదంపై ఒక పక్క కోర్టును ఆశ్రయించడంతో పాటు మరోవైపు తితిదేపై ఒత్తిడి తెచ్చేలా అడుగులు వేస్తున్నారు సన్నిధి గొల్ల వంశీకులు.
 
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి కార్యక్రమం సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహిస్తారు. ఇప్పటికీ పురాతన కాలంలో నిర్దేశించిన విధంగా స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణ జరుగుతుంది. ఆలయ పూజా కైంకర్యాలకు సంబంధించి అర్చకులు, జియ్యంగర్లు, ఆచార్య పురుషులు, అన్నమాచార్య వంశీకులతో పాటు సన్నిధి గొల్ల కుటుంబం పాత్ర ప్రతి నిత్యం ఉంటుంది. అసలు శ్రీవారిని ప్రతి నిత్యం ముందుగా దర్శించుకునే భాగ్యం సన్నిధి గొల్ల కుటుంబ సభ్యుడిదే. 
 
ఈ అవకాశం సన్నిధి గొల్ల కుటుంబీకులకు రావడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్వామివారు లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి విచ్చేసిన సమయంలో పుట్టలో ఉంటారు. స్వామివారి ఆకలిని తీర్చడానికి బ్రహ్మపరమేశ్వరులు ఆవు, దూడ రూపంలో వస్తారు. పశువుల కాపరి వీటిని అడవికి తీసుకువెళ్ళిన సమయంలో ఆవు తన పాలను శ్రీవారికి అందిస్తుంది. ఇది గమనించిన పశువుల కాపరి ఆవును కొట్టబోయి శ్రీవారిని గాయపరుస్తారు. భూలోకంలో శ్రీవారిని మొదటగా చూసింది యాదవుడే కాబట్టి, అప్పటి నుంచి ప్రతిరోజు తన మొదటి దర్శనం వారికే అన్న వరాన్ని ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి.
 
ఆ సంప్రదాయమే ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో కొనసాగుతోంది. అందులో భాగంగానే సన్నిధి గొల్ల కుటుంబానికి వంశ పారపర్యంగా ఈ అవకాశాన్ని కల్పించారు. రాజులు.. బ్రిటీష్‌.. మహంతుల కాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వేకువజామున 2.30 నిమిషాలకు అర్చకులను తీసుకుని ఆలయ ద్వారాలు తీస్తారు సన్నిధి గొల్ల. దివిటీలతో దీపాలను వెలిగించి ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత సుప్రభాతసేవ మొదలవుతుంది. దాని తర్వాత శ్రీవారికి పూజా కైంకర్యాలను నిర్వహిస్తారు. తిరిగి ఉదయం, రాత్రి వేళల్లో నైవేద్య సమయంలోను అర్చకులను సన్నిధి గొల్ల తోడ్కొని వెళతారు. ఇక రాత్రి వేళ శ్రీవారి ఏకాంత సేవ పూర్తి అయిన తర్వాత ఆలయానికి తాళాలు వేసి జియ్యంగార్లు భద్రపరుస్తారు. ఇలా శ్రీవవారికి ఆలయంలో పూజా కైంకర్యాలు అనునిత్యం జరుగుతాయి.
 
కానీ 1996లో రాష్ట్ర ప్రభుత్వం మిరాసీ విధానాన్ని రద్దు చేసింది. అప్పటివరకు అర్చకులు, సన్నిధి గొల్ల కుటుంబాలకు ఉన్న హక్కులు కోల్పోయారు. దీంతో సన్నిధి గొల్లలను ఉద్యోగులుగా మార్చేసింది తితిదే. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా తాజాగా అర్చకులు తరహాలో 65 సంవత్సరాలు దాటింది కాబట్టి పదవీ విరమణ చెయ్యాలంటూ వారికి ఆదేశించింది తితిదే. వంశపారపర్యంగా కొనసాగుతున్న తమను అనుకోని విధంగా నెలరోజులు కూడా గడువు ఇవ్వకుండా ఈనెల చివరి నాటికీ పదవీ విరమణ చెయ్యమని ఆదేశించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సన్నిధి గొల్ల కుటుంబీకకులు.
 
గతంలో అర్చకులకు సంబంధించి మిరాసీ వ్యవస్థ రద్దవడంతో వారు కోర్టుకెక్కారు. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యే మార్గంగా 2006లో అర్చక కుటుంబీకులకు వంశపారపర్య హక్కులు కల్పించింది. దీంతో వివాదం సద్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో తిరిగి అర్చకులకు 65 సంవత్సరాల వయోపరిమితి విధించారు. దీనిపైనా అర్చకులు కోర్టుకెల్లడంతో తిరిగి వెనక్కి తగ్గిన తితిదే చివరికి వారు సాగినన్ని రోజులు కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. తాజాగా సన్నిధి గొల్లలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వంశపారపర్యంగా కొనసాగుతున్న వారిని సాగనంపేలా తితిదే ప్రయత్నం చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదాలను తితిదే అధికారులు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

తర్వాతి కథనం
Show comments