వానరుడు సాక్షాత్తూ ఆంజనేయ స్వామి అవతారమని మీరు వినే ఉంటారు కదూ... అయితే ఓ కోతి చనిపోయిన తర్వాత ఎవరో ఒకరి కలలోకి వస్తూ తనకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా..! చెబితే మీరు దీన్ని బహుశా నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం...
ఈ నిజాన్ని మీకు చూపించేందుకు గాను మిమ్మల్ని ఈ వారం మధ్యప్రదేశ్‌లోని రాట్లామ్ జిల్లాకు తీసుకువెళుతున్నాం. ఆ జిల్లాలో బార్సి అనే ఓ గ్రామం ఉంది. గత సంవత్సరం దీపావళి పర్వదినాన ఈ గ్రామంలో ఓ వానరాన్ని ఎవరో చంపేశారు. వానరం వీర హనుమాన్ అవతారం అని నమ్ముతారు కాబట్టి ఆ గ్రామస్తులు దానికి అంత్యక్రియలు జరిపారు.
అయితే... సరిగ్గా సంవత్సరం తర్వాత ఆ వానరం ఆ ఊరి సర్పంచ్ కలలోకి వచ్చి తనకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేస్తే అతడి సమస్యలు అన్నీ తీరుస్తానని చెప్పింది. అంతేకాక జబ్బుపడిన పశువులన్నింటికీ నయం చేస్తానని కూడా వానరం కలలో హామీ ఇచ్చిందట. పైగా గ్రామస్తులను వానదేవుడు కరుణిస్తాడని, ఊర్లోని అన్ని కుటుంబాలు సంతోషంతో కళకళలాడుతాయని ఆ వానరం చెప్పింది.
WD
ఈ సంఘటన గురించి సర్పంచ్ శంకర్ సింగ్ గ్రామస్తులకు తెలిపారు. ఈ వార్తను ధ్రువపరచుకునేందుకు గ్రామస్తులు అందరూ పొరుగూరికి వెళ్పారు. అక్కడ నాగదేవత ఈ గ్రామంలో ఒకరికి పూని, వానరం చెప్పింది నిజమేనని నమ్మబలికింది. దానికి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు చేయవలసిందిగా కోరింది.
WD
అప్పుడు.. గ్రామస్తులందరూ కలిసి శాస్త్ర్రోక్తంగా దానికి అంత్యక్రియలు జరిపారు. ఈ సత్కార్యానికి బార్సీ గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. ఆ రాత్రి అఖండ రామాయణ పారాయణం జరిపారు. ఉజ్జయినిలోని క్షిప్రా నది ఒడ్డున ఆ వానరానికి తక్కిన సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇలా వానరానికి శాస్త్రసమ్మతంగా అంత్యక్రియలు పూర్తి చేసి రెండు రోజులయ్యిందో లేదో... కుండపోతగా ఆ ప్రాంతంలో వర్షం కురిసింది. ఎక్కడ చూసిన పచ్చదనం గుబాళించింది. గ్రామస్తులు ఈ దృశ్యం చూసి పొంగిపోయారు. అయితే బార్సీ గ్రామంలో జరిగిన ఈ నిజమైన ఘటన గురించి మీరేమంటారు. ఇది నిజంగా మతపరమైన విశ్వాసమేనా లేక మూఢ నమ్మకమా.. సర్పంచ్ కలలోకి వచ్చిన వానరం వీరాంజనేయుడా లేక కేవలం ప్రజల అంధ విశ్వాసమేనా? ఈ ఉదంతంపై మీ అభిప్రాయాన్ని దయచేసి మాకు రాయండి.