Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా?

ధ్వజస్థంభం... ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తరువాతే లోపలికి వెళతాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఒక కథ ఉంది.

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (13:39 IST)
ధ్వజస్థంభం... ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తరువాతే లోపలికి వెళతాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఒక కథ ఉంది.
 
భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలుపెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమని చెబుతాడు.
 
ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు.
 
తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూర ధ్వజుడ్ని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబలపరాక్రమవంతులైన భీమార్జునేలే ఓడిపోయారని అతడ్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు.
 
శ్రీక్రిష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరతాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డువచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూర ధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతడ్ని వదిలేస్తానని చెప్పిందని, కనుక ప్రభువులు మా యందు దయతలచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు.
 
వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూర ధ్వజుడు మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడిభాగం పరోపకారానికి ఉపయోగపడింది. కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు.
 
మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజా నీ దానగుణం అమోఘం. ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు. పరమాత్మా.. నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి.. అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికి... మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది.
 
ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం, నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూసే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్థంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తరువాతే మూల విరాట్లు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments