తన ముగ్గురు ప్రియురాళ్లతో ఎంజాయ్ చేయడం కోసం అనిల్ రావత్ అనే ఓ మాజీ సైనికోద్యోగి 9 బ్యాంకులను దోచుకున్నాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని షయోపూర్ యూకో బ్యాంక్ శాఖ నుంచి రూ.36.46 లక్షలను దొంగిలించిన అనిల్ రజావత్ హిమాచల్ ప్రదేస్లోని సోహాన్లో సోమవారం పట్టుబడ్డాడు. తాను మొత్తం తొమ్మిది బ్యాంకులను దోచుకున్నట్లు, అవన్నీ కేవలం తన ప్రియురాళ్లను సంతోష పెట్టేందుకే చేసినట్టు వెల్లడించారు.
ఆ తర్వాత పోలీసులు అతని వద్ద జరిపిన విచారణలోని విషయాలను విని తెల్లబోయారు. ఆర్మీలో ఏడేళ్ళ పాటు పనిచేశానని, ఆ సమయంలో దోపిడీలకు పాల్పడే టెక్నిక్‌లు నేర్చుకుని దోపిడీలు మొదలుపెట్టినట్టు చెప్పాడు.
యూకో బ్యాంకు దోపిడీకి ముందు తాను 9 బ్యాంకుల్లో లూటీ చేసినట్లు అతడు అంగీకరించాడు. దోచుకున్నదంతా తన గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టేవాడినని, చేతులో డబ్బులు అయిపోగానే మరో బ్యాంకు దోపిడీ చేసేవాడినని అతడు తెలిపాడు. ఈ దొంగతనాల్లో తాను ఇద్దరు స్నేహితుల సాయం కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఇపుడు ఈ ఇద్దరు స్నేహితులతో పాటు.. తన ప్రియురాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.