రేప్... అత్యాచారం... స్త్రీ బతుకును ఛిద్రం చేసే పురుషుని అతి హీనమైన చర్య. ఇలాంటి పాశవికమయిన క్రీడకు మగాడు ఎందుకు దిగుతాడు..? అసలు అత్యాచారానికి పాల్పడేందుకు మగాడ్ని ఉసిగొల్పేది ఏమిటి? రేప్ ద్వారా మగాడు పొందే సుఖం ఎంత? తనలో ఉన్న మానసిక ఆందోళన, ఒత్తిడిల వల్ల మగాడు మృగంగా మారుతున్నాడా?
అసలు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడే మగాడి మనస్తత్వం ఎలా ఉంటుంది? అతడి ప్రవర్తన తన భార్య, చెల్లి, కుమార్తె, ఇతర బంధువర్గానికి చెందిన స్త్రీల పట్ల ఎలా ఉంటుంది? చిన్నప్పట్నుంచే స్త్రీలంటే ఏహ్య భావంతో పెరిగినవాళ్లే ఇలా చేస్తారా..? ఎవ్వరూ లేని సమయంలో ఓ ఒంటరి మహిళపై అదను చూసి బలహీనురాలుగా ఉన్న సమయంలో క్రూరమయిన, హేయమయిన, దారుణమయిన అత్యాచారానికి ఒడిగట్టే మగాడు మానసిక స్థితి ఏంటి? అని చూస్తే ఎన్నో కోణాలు... ఎన్నో సమాధానాలను ఇస్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు.
ఏ మగాడయితే మానసికంగానే కాక, శారీరకంగా ఆత్మన్యూనతా భావంతో కుంగుతూ ఎదుటివారికంటే తాము తక్కువవారమన్న స్వభావంతో, తమను ఏ మహిళా పట్టించుకోవడం లేదు, ఆకర్షించలేకపోతున్నామన్న దుగ్ధతో ఉన్నప్పుడే ఇలాంటి భావనలో ఉంటాడని అంటున్నారు.
ఇలాంటి వక్రచూపులు చూసే 'జంతువు' తన చేతికి ఎప్పుడు మహిళ దొరుకుతుందా అని చూస్తాడు. రేప్ అనే చర్య కోసం కాచుకుని ఉంటాడని కొందరు మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే మాట. పశుబలంతో స్త్రీపై జరిపే అత్యాచారం వల్ల ఆమె అనుభవించే నరకయాతనను చూసి ఇలాంటి మగాళ్లు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే అతడి పతనం కూడా అక్కడ్నించే ప్రారంభమవుతుందన్న సంగతి దుర్మార్గానికి పాల్పడ్డాక కాని తెలియదు అతడికి.
కానీ తన చర్య వల్ల ఓ యువతి బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నామన్న స్పృహ లేని పశువుల లెక్కన ఇటువంటి మగాళ్లు ప్రవర్తిస్తారు. ఇలాంటివారు ఎక్కడయినా ఉండొచ్చు. అందుకే మహిళలు తమ చుట్టుప్రక్కల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు సాగాలని చెపుతున్నారు.
రేపిస్టులుంటారు జాగ్రత్త...!! పశువుల్లా ప్రవర్తించే రేపిస్టులు ఇక్కడ ఉండరులే అనుకోవడం పొరపాటు. అందువల్ల స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చీకటి పడకముందే ఇంటికి వచ్చేయమ్మా అని తల్లిదండ్రులు చెప్పే మాటను అమ్మాయిలు తు.చ తప్పకుండా పాటించేందుకు ప్రయత్నించాలి.
అంతేకాదు... రోడ్డుపై నడుస్తున్నప్పుడు ప్రత్యేకించి ఓ వ్యక్తి మిమ్మల్నే అనుసరిస్తున్నాడంటే అప్రమత్తత అవసరం. రోడ్డు వెంట పార్క్ చేసిన కారు ఆగి ఉన్నట్లు గమనిస్తే ఆ కారు ఉన్న దిక్కును వదిలి మరో దిక్కులోకి మార్గాన్ని మార్చుకోవాలి. సుదూర బస్సు లేదా రైలు ప్రయాణం చేయాల్సి వస్తే ఒంటరిగా అయితే పగటిపూట సమయాలను, పేరెంట్స్ తో అయితే రాత్రివేళల్లో చేయవచ్చు. అయితే బస్సులో తగినంతమంది ప్రయాణికులు లేనట్లయితే మరో బస్సును చూసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్పే మాటలు నీటి మూటలని ఎన్నోమార్లు రుజువవుతోంది. కనుక మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది.