2 జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో జేపీసీ విచారణకు ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ అర్థరహితమని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరో మారు స్పష్టం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేకపోతే.. వారు మావోయిస్టుల్లో చేరాలని ఉచిత సలహా ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొత్తం కోల్పోయాం. విపక్షానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేదని ఇది రుజువు చేస్తోంది. కనుక వారు మావోయిస్టుల్లో చేరవచ్చు అని బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిన ఒక ర్యాలీలో అన్నారు.
ఇదిలావుండగా, స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ దర్యాప్తు వేయాల్సిందేనని, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రతినిధి ప్రకాశ్ జవ్‌దేకర్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో మొదలు కానున్న బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ డిమాండ్‌ను వదిలేది లేదన్నారు. స్పెక్ట్రమ్ అంశంలో డీఎంకేతో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. కాగ్‌పై ప్రస్తుత టెలికామ్ మంత్రి కపిల్ సిబల్ ధ్వజమెత్తడంతో టెలికం మాజీ మంత్రి రాజాను నిర్ధోషిగా వదలిపెట్టేస్తారన్న సందేహం కలుగుతుందన్నారు.