2 జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించి కేంద్ర టెలికామ్ శాఖ మంజీ మంత్రి ఏ.రాజా శుక్రవారం ఉదయం సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. న్యూఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన రాజాను, అధికారులు ప్రశ్నిస్తున్నారు.
2 జి కేటాయింపుల ద్వారా సుమారు 1.76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే. ఇందులో కార్పొరేట్ లాబీయిస్ట్ నిరా రాడియాతో పాటు.. టెలికామ్ శాఖ మాజీ మంత్రి రాజాలు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు తమ ఎదుట హాజరుకావాలని రాజాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. వీటికి స్పందించిన రాజా చెన్నయ్ నుంచి ఢిల్లీకి వెళ్లి సీబీఐ కార్యాలయానికి వెళ్లి హాజరయ్యారు.
ఇందులో రాజాతో పాటు రాజా బంధువులు పాత్ర, స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు లైసెన్సుల కేటాయింపు తదితర అంశాలపై రాజా వద్ద సీబీఐ ప్రశ్నించనుంది. ఇదిలావుండగా, ఇప్పటికే రాజాతో పాటు ఆయన బంధువుల ఇళ్ళపై సీబీఐ సోదాలు నిర్వహించిన విషయం తెల్సిందే.