ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి పీఠం తమనే వరిస్తుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్‌లు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తుది దశ ఎన్నికల పోలింగ్ శనివారం ముగిసిన విషయం తెల్సిందే. పోలింగ్ అనంతరం వారు పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సీంకర్ణ ప్రభుత్వాన్ని ఓటర్లు ఇంటికి సాగనంపనున్నారని వారు జోస్యం చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయన్నారు. ఈనెల 24వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో నితీష్ కుమార్‌కు పదవీగండం తప్పదన్నారు. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగి పోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి నితీష్ కుమారేనన్నారు. అది విస్మరించిన నితీష్ కుమార్.. యూపీఏ సర్కారుపై నిందలు మోపడం సరైనది కాదన్నారు.
ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ ఆరో దశలో జరిగిన 22 సీట్లను తమ కూటమి కైవసం చేసుకుంటుందన్నారు. ఈనెల 24వ తేదీన వెలువడనే ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో ఆర్జేడీ, ఎల్జేపీ కూటమి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పాశ్వాన్ జోస్యం చెప్పారు.