అత్యున్నత నిర్ణయాత్మక విధాన మండలిగా భావించే 13 మంది సభ్యుల సీపీఎం పోలిట్ బ్యూరో శుక్రవారం భేటీ కానుంది. ఇందులో భారత్-అమెరికా అణు ఒప్పందంపై కేంద్రంలోని యూపీఏ సర్కారుతో ఉన్న సంబంధాలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే సీపీఐ జాతీయ కమిటీ కూడా ఇదే అంశంపై దేశ రాజధాని న్యూఢిల్లీలో సమావేశంకానుంది. ఈ సమావేశాల్లో కమ్యూనిస్టు వృద్ధనేతలైన జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సూర్జీత్‌లతో పాటు.. మరికొందరు సీనియర్ నేతలు కూడా హాజరుకావచ్చని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలావుండగా.. అణు ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పిన వామపక్షాలు.. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరపాలని పట్టుపట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా లెఫ్ట్-యూపీఏ కో-ఆర్డినేషన్ కమిటీ నుంచి వైదొలగే అంశం, అణు ఒప్పందంపై సర్కారు వెనక్కి తగ్గే వరకు మద్దతు ఉపసంహరించుకునే విషయాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఇప్పటికే కో-ఆర్డినేషన్ కమిటీ నుంచి వైదొలగి, ప్రభుత్వాన్ని పడిపోకుండా చూస్తూ.. వేచి చూసే ధోరణి అవలంభించాలని కొందరు వామపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.
అయితే.. ప్రకాష్ కారత్, రామచంద్రన్ పిళ్లై, ఎంకే.పాండే వంటి నేతలు యూపీఏతో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తుండగా.. సీతారాం ఏచూరీ, బుద్దదేవ్ భట్టాఛార్య వంటి వారు సామరస్యపూర్వంగా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష నేతల భేటీపైనే యూపీఏ సర్కారు, దేశ రాజకీయ నిపుణులు చూపులు ఉన్నాయి.