ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు పొందిన అనంతరం కెన్సింగ్‌టన్ ప్యాలెస్‌లో కొత్త హంగులను సంతరించుకున్న తన పాత నివాసానికి డయానా చేరుకున్నారు. మృత్యువు ఒడిలోకి చేరుకునేంతవరకూ ఆమె ఆ నివాసంలోనే కొనసాగారు. హృద్రోగ నిపుణుడైన హస్నత్ ఖాన్‌తో బహిరంగంగా ప్రేమాయాణం ప్రారంభించిన ఆమె, అనంతరం తన ప్రేమాయణాన్ని దోడి అల్-ఫాయేద్‌కు పరిమితం చేసుకుంది.
అదేసమయంలో విడాకుల అనంతర జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేయాలన్న లక్ష్యంతో రెడ్ క్రాస్ సంస్థ కార్యకలాపాల్లో పాలు పంచుకొనటమే కాక ప్రపంచమానవాళికి ముప్పుగా పరిణమించిన మందుపాతర్ల సంస్కృతికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి మందుపాతర్ల నివారణ పట్ల అంతర్జాతీయ సమాజంలో డయానా కొత్త ఆలోచనలను రేకెత్తించారు. ఈ నేపథ్యంలో వారి ప్రచారానికి మరియు జూడీ విలియమ్స్‌కు సంయుక్తంగా 1997వ సంవత్సరపు నోబుల్ శాంతి పురస్కారం లభించింది.
ఇదిలా ఉండగా మానవాళికే మహమ్మారిగా పరిణమించిన ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకుగాను ఒక ప్రతిష్ఠాత్మక వ్యక్తిగా ఆమె తీసుకున్న చొరవ యావత్‌ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. 1987వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో చైన్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ వ్యాధి సోకిన వ్యక్తి చేయిని డయానా పట్టుకోవడం అంతర్జాతీయంగా సంచలనానికి దారితీసింది. ఆమె చూపిన మానవత్వం హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల ప్రజలలో గల అపోహలను కొంతమేరకు దూరం చేసిందని చెప్పవచ్చు.
సామాజిక సేవకు కొత్త అర్థాన్ని ఆవిష్కరిస్తూ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన డయానాను మృత్యువు పాపారాజ్జీ(రహస్యంగా ఫోటోలు తీసే ఎల్లో జర్నలిజంకు చెందిన ఫోటోగ్రాఫర్ల రూపంలో వెంటాడింది.
WD Photo
WD
దశాబ్దం క్రితం ఇదే రోజు... 1997, ఆగస్టు, 31వ తేదీ... సంఘటన జరిగిన ప్రాంతం... పారీస్ మహానగరం... పాంట్ డె ఎల్‌అల్మా సొరంగ మార్గం...
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు ఝామున నాలుగు గంటల ప్రాంతంలో హోటల్ రిడ్జ్ పారీస్ నుంచి దోడి అల్-ఫాయోద్ మరియు తాత్కాలిక భద్రతా నిర్వాహకుడు హెన్రీ పాల్‌తో కలిసి వెలుపలకు వచ్చిన డయానాకు తనను రహస్యంగా ఫోటోలు తీయడానికి కాచుకుని ఉన్న పాపరాజ్జీలు కంటపడ్డారు. అప్పటికే మీడియా వైఖరితో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నానని బాధపడుతున్న డయానాకు వారిని చూడగానే అసహనం కలిగింది. సిద్ధంగా ఉన్న మెర్సిడెస్ బెంజి కారులో సహచరులతో కలిసి ఆమె ప్రయాణం మొదలుపెట్టారు.
కారు కదలగానే పాపరాజ్జీలు కారును వెంటాడటం ప్రారంభించారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకునేందుకు కారును నడుపుతున్న హెన్రీ పాల్ మితిమీరిన వేగంతో కారును నడపసాగాడు. పాంట్ డె ఎల్‌అల్మా సొరంగ మార్గాన్ని చేరుకోగానే అదుపు తప్పిన కారు సొరంగంలోని స్థంభానికి ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డయానాను ఆసుపత్రికి తరలిస్తుండగానే స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు ఝామున నాలుగు గంటలకు డయానా కన్నుమూసింది.
డయానా కన్నుమూసినప్పటికీ అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచే దిశగా ఆమె ప్రారంభించిన సేవాకార్యక్రమాలు ఆర్తులను ఆదుకుంటూ చిరంజీవిగా కొనసాగుతున్నాయి.