అడవికి రారాజు సింహం. దాన్ని చూస్తే అడవి జంతువులన్నీ ప్రాణ భయంతో పరుగులు తీయాల్సిందే. అలాంటి క్రూర జంతువైన సింహం.. ఓ బాతు పిల్లకు సాయం చేసింది. ఈ క్రూర మృగాలు కూడా ఆకలి వేసినప్పుడే తప్ప ఆకారణంగా ఏ జంతువుకు హాని తలపెట్టవని జంతు ప్రేమికులు చెబుతుంటారు. వారు చెప్పేది నిజమేనని తాజాగా ఓ సింహం నిరూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇంతకూ ఆ సింహ రాజు చేసిన గొప్ప పని ఏమిటంటే చెరువు ఒడ్డుకు వచ్చి ఈదడానికి ఇబ్బంది పడుతున్న ఓ బాతుపిల్లను ముందు కాళ్లతో తిరిగి నీటిలోపలికి తోసేసి సులువుగా ఈదేందుకు సాయపడింది. సింహం బాతుపిల్లకు సాయం చేస్తున్న ఆ దృశ్యం అక్కడే ఉన్న కెమెరాకు చిక్కింది.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 10 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. అయితే, ఆ వీడియోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తున్నది. కొంతమంది సుశాంత నంద అభిప్రాయంతో ఏకభవించగా, మరికొంత మంది మాత్రం సింహం ఆ బాతును కాపాడినట్లే కాపాడి తింటుందని అభిప్రాయపడ్డారు.