దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఓ వైద్య కళాశాలకు చెందిన యువతిని కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఛండోలి జిల్లాలో వున్న యునాని వైద్య కళాశాలలో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని.. ఇంటికి తిరుగుప్రయాణమయ్యేందుకు బస్టాప్‌లో నిల్చుంది. అక్కడకు వచ్చిన కొందరు దుండగులు 20 ఏళ్ల యువతిని కత్తిని చూపెట్టి బెదిరించారు. బలవంతంగా ఆ యువతిని కిడ్నాప్ చేసి.. ఓ ఇంట్లో నిర్భంధించారు.
ఆపై ఆమెతో ఫూటుగా మద్యం తాగించారు. మద్యం తాగడంతో మత్తులోకి జారుకున్న ఆ యువతిపై ముగ్గురు దుండగులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ ముగ్గురు కూడా మద్యం తాగి.. స్పృహ కోల్పోయారు. ఇంతలో బాధితురాలికి మెళకువ రావడంతో అక్కడి నుంచి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.