జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో బుధవారం ఓ మహిళా టెలివిజన్ ఆర్టిస్ట్, ఆమె మైనర్ మేనల్లుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అమ్రీన్ భట్ అనే మహిళా నటి గాయాలతో మరణించగా, 10 ఏళ్ల మేనల్లుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాత్రి 8 గంటల సమయంలో, జిల్లాలోని చదూరా ప్రాంతంలోని హుష్రూలో ఆమె నివాసానికి సమీపంలో ఉన్న అమ్రీన్ అనే టీవీ ఆర్టిస్ట్ పైన ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఒక అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
తీవ్రంగా గాయపడిన అమ్రీన్‌ను చదూర ఆసుపత్రికి తరలించారు. ఐతే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిందని తెలిపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబేర్ కూడా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ప్రమేయం ఉన్నదని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తీవ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. లోయలో పౌర హత్యల పరంపర సాగుతోంది. మే 12వ తేదీన బుద్గామ్ జిల్లా చదూరాలోని తహసీల్ కార్యాలయంలోని రాహుల్ భట్ అనే ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.