జగన్‌కు ముద్రగడ సవాల్.. జనసేన పార్టీ పల్లకీనే మోస్తారా?
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఇతర కులస్థులకు సీఎం పదవి ఇస్తావా అంటూ ప్రశ్నించారు. ఆదివారం గుడివాడ పట్టణంలో కాపు సేవాసమితి వార
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఇతర కులస్థులకు సీఎం పదవి ఇస్తావా అంటూ ప్రశ్నించారు. ఆదివారం గుడివాడ పట్టణంలో కాపు సేవాసమితి వార్షికోత్సవ కార్యక్రమంలో జగన్‌ను వ్యతిరేకిస్తూ ముద్రగడ మాట్లాడారు.
ఆయన మాటలను బట్టి చూస్తే జనసేనాని వైపు మళ్లుతారని తెలుస్తోంది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ సీఎం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారు. ఈ స్థితిలో ముద్రగడ పవన్ కల్యాణ్‌ను వచ్చే ఎన్నికల్లో సమర్థించే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇంకా ముద్రగడ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని పాదయాత్ర సభలో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదన్నారు. తామే రూ.20 వేల కోట్లు ఇస్తామని, ఇతర కులస్థుడికి సీఎం పదవి ఇస్తారా? అని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. తమ డిమాండ్లను పరిష్కరించిన పార్టీనే పల్లకీలో మోస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.
మరోవైపు అచంట, పాలకొల్లు నియోజకవర్గ బహిరంగ సభల్లో జనసేనాని ప్రజలపై వరాల వర్షం కురిపించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లలో బీసీలకు పెంపు ఉంటుందని, ఎస్సీలను ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి తీసుకు వస్తామని, 9వ షెడ్యూల్ ద్వారా కాపులకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
అలాగే ముస్లిం అభ్యున్నతికి సచార్ కమిటీ చెప్పిన విధానాలు అమలు చేస్తామని, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల యువతకు అండగా ఉండేందుకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని, వీటన్నింటిని జనసేన మేనిఫెస్టోలో పొందుపర్చి అమలు చేస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదించాలన్నారు.
ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త విషయం చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిచారు. తన కూతురికి చర్చిలోనే నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. తాను బైబిల్ నుంచి చాలా నేర్చుకున్నానని, సర్వమతాలను గౌరవిస్తానని అన్నారు.