ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఆక్రమణలను తొలగించేందుకు చేపట్టిన చర్యలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో మధుర పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న హేమమాలిని మధుర అల్లర్లతో తనకేమాత్రం సంబంధం లేదన్నట్లు ముంబైలో 'ఏక్ థీ రాణి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండిపోయారు.
పైగా షూట్ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలు బీజేపీ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. తక్షణం ఫొటోలను తొలగించాలని హేమమాలినిని పార్టీ పెద్దలు ఆదేశించారు. దీంతో ఆగమేఘాలపై ఫొటోలను తొలగించిన ఆమె.. తాను చాలా సున్నిత మనస్కురాలినని, తన అవసరం ఉంటే మధురలో పర్యటిస్తానని ట్వీట్ చేశారు. ఘటనలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు.. ఈ ఘర్షణలను ఖండిస్తూ శనివారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీనికి ఎంపీ హేమమాలిని నాయకత్వం వహించడం గమనార్హం.