70:30 చేస్తే దొంగ... 40:60 చేస్తే దొర! ఇదేం వ్యవస్థాగత దోపిడీ మోదీజీ!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో అతి పెద్ద సంచలనాన్ని రేపిన కేంద్రం... ఇపుడు కొత్త ఆలోచనతో మరింత కంగారుపెడుతోంది. బ్లాక్ మనీ ఎంతైనా బ్యాంకులో కట్టండి... 60 శాతం పన్నుతో 40 శాతం వైట్ చేసుకోండనే ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో అతి పెద్ద సంచలనాన్ని రేపిన కేంద్రం... ఇపుడు కొత్త ఆలోచనతో మరింత కంగారుపెడుతోంది. బ్లాక్ మనీ ఎంతైనా బ్యాంకులో కట్టండి... 60 శాతం పన్నుతో 40 శాతం వైట్ చేసుకోండనే ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ ఆలోచన వల్ల ఏం లాభం? ఎవరికి లాభం? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 500, 1000 నోట్ల రద్దుతో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ వ్యాపారం దేశవ్యాప్తంగా నడుస్తోంది. పాత నోట్లు ఇస్తే, దానిలో 30 శాతం కట్ చేసుకుని 70 శాతం కొత్త నోట్లను కొంతమంది మారకం చేస్తున్నారు. ఇలా చేస్తున్న పలు ముఠాలను పోలీసులు ఇప్పటికే దేశవ్యాప్తంగా పట్టుకున్నారు.
పాత, కొత్త నోట్లను సీజ్ చేసి వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. అయితే, మరి ఇపుడు కేంద్రం ఇదే మొత్తం బ్యాంకుల్లో ఎంతైనా వేయండి. 60 శాతం తాము పన్ను కట్ చేసుకుని మిగతా 40 శాతం వైట్ చేస్తాం అని ప్రతిపాదించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు చేస్తే దొంగ... ప్రభుత్వం చేస్తే దొరనా అని ఎద్దేవా చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నట్లు ఇది వ్యవస్థీకృతమైన దోపిడీగానే అభివర్ణిస్తున్నారు.
అయినా... నల్ల కుబేరులు బయటపడతారా?
ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిస్తున్న 60 - 40 శాతానికి నల్ల కుబేరులు సిద్ధపడి బయటకు వస్తారా? అనే ప్రశ్నకు సమాధానం దాదాపు నిల్ అనే వినిపిస్తోంది. 40 శాతం ప్రయోజనం కోసం ఎవరు బయటపడతారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చాలామంది నల్ల కుబేరులు తమ ధనానికి ప్రైవేటు వడ్డీలు లింక్ అయి ఉంటాయని, వాటిని వదులుకుని... 40 శాతం కోసం బయటపడితే... చివరికి వారికి మిగిలేది 20 శాతం కూడా ఉండదని పేర్కొంటున్నారు. ఈ మాత్రానికి ప్రభుత్వం, లోకం దృష్టిలోకి ఎందుకు రావాలనే ఆలోచనతో వెనక్కి తగ్గే ప్రమాదమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం తాజా ప్రతిపాదన వల్ల మరింతగా నల్ల ధనం లోపాయికారిగా మారకం జరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.