దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి ఈ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఢిల్లీ వాసులు చలికి తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అలాగే, పగటిపూట కూడా పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఫలితంగా నగర వ్యాప్తంగా వాహనాలు రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోంది. విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు మార్గాల్లో రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.
ముఖ్యంగా, నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతంలో పొగమంచు కారణంగా దారి కనిపించక, జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో మూడు చోట్ల వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయి. పశ్చిమ యూపీలోని ప్రయాగ్ రాజ్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలకు పడిపోయాయి.
పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం పూర్తిగా మంచులో కూరుకునిపోయింది. ఈ దేవాలయాన్ని గత నెలలో మూసి వేసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో పలు చోట్ల మంచు వర్షం కురుస్తోంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజన్సీ పరిధిలోని లంబసింగిలో 1.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. హైదరాబాద్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా శనివారం రాత్రి ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు తగ్గింది.