పెళ్లి మండపంలో ఓ వధువు విషం తాగింది. దీంతో పెళ్లి ఆగిపోయిందని ప్రతి ఒక్కరూ భావిస్తున్న వేళ... చివరి నిమిషంలో ఈ పెళ్లి ముగిసింది. పెళ్లి పీటలపై వధువు చెల్లి కూర్చోవడంతో ఈ తంతు ముగిసింది.
పెళ్లి మండపంలో ఓ వధువు విషం తాగింది. దీంతో పెళ్లి ఆగిపోయిందని ప్రతి ఒక్కరూ భావిస్తున్న వేళ... చివరి నిమిషంలో ఈ పెళ్లి ముగిసింది. పెళ్లి పీటలపై వధువు చెల్లి కూర్చోవడంతో ఈ తంతు ముగిసింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తిరుచ్చి జిల్లా తురైయూరు ఒట్టంపట్టిలో ప్రొక్లెయిన్ యంత్రం ద్వారా జీవనం సాగిస్తున్న బాలకుమార్ (27)కు సేలం జిల్లా సెందూరపట్టికి చెందిన శరణ్య (20) అనే యువతితో ఇటీవల పెళ్ళి నిశ్చితార్థం జరిగింది. ఆ మేరకు తురైయూరులోని ఓ గుడిలో బుధవారం ఉదయం వీరి వివాహం జరగాల్సి ఉంది.
మంగళవారం రాత్రి వధువు ఊరేగింపు, విందులు వినోదాలు వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం పెళ్లిపీటలపై బాలకుమార్ కూర్చున్న వేళ వధువు రాకకోసం అందరూ వేచి చూస్తుండగా గదిలో ఆ వధువు శరణ్య విషం తాగి నోట నురగతో నేలపై పడి ఉండటాన్ని బంధువులు చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే శరణ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, పైచదువులు చదవాలని అనుకుంటున్నానని, ఆ కారణంగానే విషం తాగానని శరణ్య చెప్పడంతో వరుడు బాలకుమార్ తరపు బంధువులంతా ఆందోళనకు దిగారు.
పోలీసులు ఇరువైపు బంధువులను పిలిచి రాజీకి ప్రయత్నించారు. ఇంతలో అక్కడే తచ్చాడుతున్న శరణ్య చెల్లెలు సంగీత (18)పై బాలకుమార్ బంధువుల దృష్టి పడింది. సంగీతను పెళ్లి చేసుకోవడానికి సమ్మతిస్తారేమోనని ఆమె తల్లిదండ్రులను బాలకుమార్ బంధువులు అడిగారు. సంగీత అభిప్రాయం కోసం తల్లిదండ్రులు అడిగితే... ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నానని తెలపడంతో అప్పటిదాకా పెళ్లి ఆగిపోతుందనుకున్నవారిలో మళ్లీ సంతోషం వచ్చింది. ముహూర్తం దాటకముందే బాలకుమార్ సంగీత మెడలో తాళికట్టాడు.