హిమాలయా ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఏమాత్రం ఆగడం లేదు. ఈ కారణంగా సంభవించిన వరదల వల్ల ఇప్పటివరకు 75 మంది మృత్యువాతపడ్డారు. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. 31 మంది గల్లంతయ్యాయి. మెరుపు వరదలతో జనజీవనం స్తంభించి పోయింది.
ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలో 240కి పైగా రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో అత్యధికంగా 176 రోడ్లు ఒక్క మండి జిల్లాలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతుంది. భారీ వర్షాలతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల మేరకు అత్యధిక వర్షంపాతం నమోదైంది.
ఇదిలావుంటే, వాతావరణ శాఖ రానున్న 24 గంటలకు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. చంబా, కంగ్రా, సిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించవచ్చని హెచ్చరించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి, పాతబడిన భవనాల్లో ఉండవద్దని హెచ్చరించింది. మరోవైపు, వరద బాధిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు సాగుతున్నాయి.