Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌లో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఉగాది వేడుకలు!

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (12:54 IST)
న్యూయార్క్‌లోని గణేష్ హిందూ టెంపుల్ ఆడిటోరియంలో నందన నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మార్చి 31, 2012న న్యూయార్క్‌లోని గణేష్ హిందూ టెంపుల్ ఆడిటోరియంలో టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్ నుంచి విచ్చేసిన తారలతో త్రినగరాలు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ మహా నగరాల నుంచి తరలివచ్చిన వేయి మందికి పైగా వీక్షకులు, కళాకారులతో, సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆడిటోరియం కళకళలాడింది.

నూతనంగా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ వేలూరు నాగేంద్ర గుప్త గారి నాయకత్వంలో కార్య నిర్వాహక సభ్యులు రెండు నెలలుగా ఎంతో శ్రమించి రూపొందించిన ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరి హృదయాలు చూరగొన్నాయి.

వివరాలలోకి వెళ్తే:
ఉగాది పండగ అంతా ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా తోరణాలు, బానర్లు, పూదందాలతో శోభాయమానంగా అలంకరించిన స్వాగత వేదిక విచ్చేస్తున్న టీఎల్‌సీఏ సభ్యులని సాదరంగా ఆహ్వానించింది. సభ్యుల పరస్పర పలకరింపులతో, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో, పిల్లల అల్లరి చేష్టలతో, నిర్దేశించిన సమయానికన్నా ముందే హాలు నిండిపోయింది.

ప్రార్ధనా గీతంతో కార్యక్రమానికి శుభారంభం అందించారు. పంచరత్నాలు ప్రేక్షకులని భక్తీ పారవశ్యంలో ముంచెత్తాయి. రాగయుక్తంగా సాగిన ఆ సంకీర్తనలు మన త్యాగరాయ ఆరాధనోత్సవాలని తలపించాయి. టీఎల్‌సీఏ చరిత్రలోనే మొదటిసారిగా నిర్వహించిన టీఎల్‌సీఏ గాట్ టాలెంట్ షో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

త్రి నగరాలలో నివసించే తెలుగు యువత లోని ప్రతిభని వెలికి తెయడానికి టీఎల్‌సీఏ చేసిన మరో వినూత్న ప్రయోగం ఈ కార్యక్రమం. అధ్యక్షులు నరేంద్ర గుప్త గారి ఆలోచనతో రూపు దిద్దుకున్న ఈ పోటీకి నృత్యం, గానం, వాయిద్యం, ఏక పాత్రాభినయం, ఇతర ప్రతిభలు ఇత్యాది సెగ్మెంట్లలో విశేషంగా ఎంట్రీలు వచ్చాయి. వయోబేధం లేకుండా ప్రతిభే పట్టంగా ఆద్యంతం ఆసక్తిగా సాగిన పోటీలో విజేతలని నిర్ణయించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.. అని న్యాయ నిర్ణేతలు గుండు హనుమంత రావు, మహేష్ సల్లాది పేర్కొన్నారు.

కఠిన వడపోతకి గురై ఈ పోటీకి క్వాలిఫై అవడమే ఒక విజయంగా వర్ణిస్తూ పాల్గొన్న కళాకారులని అభినందించారు. ప్రథమ విజేత గా పూజా నట్టు ద్వితీయ విజేతగా సిద్ధూ ఎలిసెట్టి నిలిచారు.

ఇక తరవాయి భాగంలో తెలుగు సినిమా 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహోన్నత ఘట్టానికి టీఎల్‌సీఏ నీరాజనం పట్టింది. సెక్రటరీ కృష్ణ శ్రీ గంధం మరియు కల్పన వనం గార్ల నృత్య దర్శకత్వంలో రూపొందిన సినీ గీతాలనృత్య కార్యక్రమం అద్భుతంగా సాగింది. దాదాపు 30 మంది టీఎల్‌సీఏ సభ్యులు మహోత్సాహంగా పాల్గొని 1931 నుండి నేటి వరకు నిర్మించబడ్డ తెలుగు సినిమాలలో ని అజరామరమైన గీతాలకి నృత్యం చేసారు. నృత్య కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకుల కరతాళ ద్వనులతో ఆడిటోరియం మారుమోగింది.

ఉగాది సంబరాలతో బాటు సభ్యులకి చక్కటి పండగ విందు భోజనాన్ని కూడా అందించింది టీఎల్‌సీఏ. సాంప్రదాయ ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పూత రేకులు, షడ్రుచులతో కూడిన అచ్చతెలుగు వంటకాల్ని చవిచూసిన తెలుగు సభ్యులు తాము స్వదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్నామన్న విషయం మరచేలా చేసింది.

భోజనానంతరం, వేద పండితులు మన తెలుగు పంచాంగాన్ని వినిపించారు. అనంతరం, వేలూరు నాగేంద్ర గుప్త సంఘం అధ్యక్షులుగా తన ఈ సంవత్సర కార్యక్రమాన్ని వివరించారు. మన సంస్కృతీ, సంస్కారాల ఉద్దీపనకి, మన కమ్యునిటీ సంక్షేమానికి టీఎల్‌సీఏ చేస్తున్న కృషిని వివరిస్తూ ఈ సంవత్సరం తాము రెండు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు.

యువతకి పెద్ద పీట వేస్తూ వారిలో తెలుగు భాష మాట్లాడడం, చదవటం, వ్రాయడం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, " Effective Speaking in Telugu for youth" అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. యువతలో భాషా సంస్కృతుల పట్ల మరింత అవగాహన పెంపొందించేందుకు టీఎల్‌సీఏ మరిన్ని కార్యక్రమాలని నిర్వహించబోతున్నట్టు చెప్పారు.

అలాగే, పిక్నిక్, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు మన కళలలో వివిధ పోటీలు నిర్వహించేందుకు కాలెండర్ సిద్ధం చేస్తున్నట్టు నాగేంద్ర గుప్త వెల్లడించారు. క్రీడలని ప్రోత్సహించే దిశగా టెన్నిస్, క్రికెట్‌లే కాకుండా మిగతా క్రీడలలో ప్రత్యేక పోటీలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు.

ఇందుకు తాము చేస్తున్న కృషిలో సర్వదా తోడున్న కార్యవర్గం చేస్తున్న నిరంతర కృషిని కొనియాడారు. అలాగే బోర్డు అఫ్ ట్రస్టీల సహకారాన్ని ప్రశంసించారు. మరింత ముఖ్యంగా, ఎప్పుడూ ఆర్ధిక, హార్దిక సహాయ సహకారాలనందిస్తూ సంస్థకి వెన్నెముకగా నిలిచి టీఎల్‌సీఏ మరియు మన కమ్యూనిటీ అభివ్రుది కి తోడ్పడే దాతల ప్రోత్సాహానికి మనః పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి తోడ్పాటు లేనిదే ఈ అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని నాగేంద్ర గుప్త తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలైన శ్రీ మల్లారెడ్డి పైలాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత తన నూతన కార్యవర్గాన్ని, నూతన బోర్డు ఆఫ్ ట్రస్టీలని సభకు పరిచయం చేశారు. బీవోటీ నూతన ఛైర్ పర్సన్ శ్రీమతి హైమారెడ్డి, వైస్ చైర్ పర్సన్ శ్రీ రాఘవరావు పోలవరపులను సభకి నాగేంద్ర గుప్త పరిచయం చేశారు.

తర్వాత న్యూయార్క్ కళాకారులు టీఎల్‌సీఏ చరిత్రలోనే నభూతో.. అన్నట్టుగా ప్రేక్షకులు శ్లాఘించిన చరిత్రాత్మకమైన ప్రదర్శన అందించారు. అదే శ్రీ నాగేంద్ర గుప్తాగా మరో ఆలోచనకి, శ్రీనివాస్ గూడూరు రూపకల్పన చేసిన దృశ్యకావ్యం, వాగ్గేయకారులు. టీఎల్‌సీఏలోని హేమా హేమీలయిన సీనియర్ నటులతో, త్రి-నగరాలలోని నృత్య గురువులు, సాధన పరంజి, ఇందిరా దీక్షిత్ మరియు సత్యప్రదీప్‌ల 20 మంది శిష్య బృందంతో కూర్చిన నృత్య రూపకల్పనతో ఉత్కంఠ భరితంగా సాగిందీ రమణీయ సంగీత భరిత రూపకం.

భక్తిని, భావాన్ని సంగీతంతో రంగరించి యావత్ తెలుగు జాతి మరిచి పోలేని సంకీర్తనలు అందించిన అన్నమయ్య, త్యాగయ్య మరియు రామదాసుల జీవితాల్లోని ముఖ్య ఘట్టాలని మూడు భాగాలుగా ప్రదర్శించారు. ఆ వాగ్గేయకారుల అకుంఠిత దైవభక్తిని, రమ్యమైన వారి సంగీత సృష్టిని కన్నులవిందుగా ప్రదర్శించారు.

ప్రతీ సెగ్మెంట్ ముగింపులో నాట్య గురువులు సమకూర్చిన నృత్యాలతో ఆ వాగ్గేయకారుడికి కళా౦జలులు సమర్పించింది ఆ నాటక బృందం. ఆ నాటకానికి శ్రీనివాస్ గూడూరు స్క్రిప్ట్, స్టేజి ప్లే, ఆడియో, దర్శకత్వం అందించగా ప్రొడక్షన్ మేనేజర్ అశోక్ చింతకుంట ఆహార్యం సమకూర్చారు. రూప శిల్పి మాధవి చింతకుంట, ప్రత్యూష గూడూరు, కృష్ణ కుమారి అవాలలు మేకప్ అందించారు. దుర్గ ధనికొండ, భగవాన్ నడింపల్లి స్టేజి సహకారం అందించారు.

తదనంతరం భారత్ నుంచి వచ్చిన చిత్ర ప్రముఖులు శ్రీ తనికెళ్ళ భరణి ఆహూతులనుద్దేశించి ప్రసంగించారు ఈనాటి వేడుకలలో టీఎల్‌సీఏకి మరో ఫస్టు, శ్రీ తనికెళ్ళ దర్శకత్వంలో విడుదల అవుతున్న "మిధునం" ఆడియో రిలీజ్. ఇంతకూ ముందెన్నడూ జరగని రీతిలో అధ్యక్షులు శ్రీ నాగేంద్ర గుప్తాగారి అధ్వర్యంలో మన స్పాన్సర్స్ ఉష మరియు పూర్ణ చంద్రా రెడ్డి అరమల్ల చేతుల మీదుగా విడుదల చేసి మొదటి కాపీని గౌరవ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీకి అందించారు శ్రీ తనికెళ్ళ భరణి. ఆపై మధుయాష్కీని జ్ఞాపికతో సత్కరించింది టీఎల్‌సీఏ.

ప్రతీ ఉగాదికి లాగే తెలుగు వెలుగు సావనీర్‌ని రిలీజ్ చేసింది టీఎల్‌సీఎ. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ నాగేంద్ర గుప్త మాట్లాడుతూ.. సావనీర్ కమిటీ చైర్ బాబు కుదరవల్లి, కోచైర్ రాజి కుంచం, సభ్యులు రావు వోలేటి మరియు సలహాదారు శ్రీనివాసు గూడూరు కృషిని కొనియాడారు. సావనీర్‌కి ప్రకటనలు ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా టీఎల్‌సీఏ ప్రముఖ ఐటీ తెలుగు వ్యక్తి 2011 ఎల్లిస్ అవార్డు గ్రహీత శ్రీ బాబూ రావు మండవని సన్మానించింది. ఆయన ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్త, గొప్ప వితరణశీలి, మానవతా వాది. ఆయన అందుకున్న ఈ పురస్కారం మన కమ్యూనిటీకంతటికీ ఎంతో గర్వకారణం అన్నారు.

సునిశిత హాస్యానికి పెరిన్నిక గన్న శ్రీ గుండు హనుమంత రావు తమ హాస్య చతురోక్తులతో ప్రేక్షకులని అలరించారు. సభలో ఉన్న ప్రేక్షకులలో కొంత మందిని అప్పటికప్పుడు ట్రైన్ చేసి వారిని కలుపుకుంటూ ఆయన చేసిన కామెడీ అందర్నీ ఆకట్టుకుంది. కళాకారులకి పెద్ద పీట వేసి రాశికన్నా వాసికి టీఎల్‌సీఏ విలువనిస్తుందని శ్రీ గుండు హనుమంత రావు చెప్పారు.

తర్వాత వేదిక కంట్రోల్ తీసుకున్న సినీ నేపథ్య గాయకులు, శ్రీ కృష్ణ చైతన్య, శ్రావణ భార్గవిలు తమ పాటలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. పాత మెలడీల నుండి నేటి తరం ఫాస్ట్‌బీట్‌ల వరకు రకరకాలైన పాటలతో ప్రేక్షకులని రంజింప జేశారు. ఈ కార్యక్రమానికి మరింత రంగులద్దడానికి విచ్చేసిన అందాల భామలు, నంది అవార్డు గ్రహీత, దూకుడు ఫేం సోనియా మరియు బన్ని హీరొయిన్ గౌరీ ముంజల్ తమ నాట్యాలతో ప్రేక్షకుల మనసులు దోచారు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రేక్షకులు గాయకులూ నటీ నటులతో కలిసి నృత్యాలు చేశారు.

చిట్టచివరగా, అధ్యక్షులు శ్రీ నాగేంద్ర గుప్త ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడ్డ కల్చరల్ చైర్ ధర్మా రావు తాపీ, వైస్ ప్రెసిడెంట్ రావు వోలేటి, కోశాధి కారి సత్య చల్లపల్లి మరియు మిగతా కమిటీ చైర్స్‌ని అభినందించారు. తన కార్యవర్గ సభ్యులకి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యదర్శి కృష్ణ శ్రీ వందన సమర్పణ చేస్తూ దాతలకు, మీడియా మిత్రులకు మరియు ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments