Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు కవిత్వానికి జ్ఞానపీఠం "సినారె"

Webdunia
FILE
" నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర
కాళ్ళకింద ధూళిపొర
ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో
మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి
చిచ్చుముద్దల్లోంచి
చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు
పాలమీగడల్లా పరుచుకున్నాయి"

అంటూ డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారు, భూమ్యాకాశాల పుట్టుక నుంచి మొదలై... కాలం స్వరూపాన్ని, మనిషి వికాసాన్ని, చైతన్యాన్ని, ఆ చైతన్యం ప్రదర్శించిన విశ్వరూపాన్ని అనేక విధాలుగా తన "విశ్వంభర" గ్రంథంలో ఆవిష్కరించారు. మనసు శక్తి ఒక వ్యక్తిగా సాగితే జీవిత చరిత్రగా.. సమష్టిగా సాగితే సమాజ చరిత్రగా... ఎలా కనిపిస్తుందో సినారె కలం దాన్ని ఒడిసి పట్టుకుని మరీ మనముందు నిలుపుతుంది.

మానవ ప్రస్థానంలో మజిలీలు, ఆ మజిలీల పునాదుల మీద భవిష్యత్తరాలు సాధించిన విజయాలు, ఆ విజయాల సోపానాల మీద పయనించిన మానవుడు పొందిన అనుభవాలు... అన్నీ ‘విశ్వంభర’ పద్య కావ్యంలో పాఠకుల కళ్లముందు సాక్షాత్కరింపజేసిన మహనీయుడు సినారె. ఆయన జన్మదినం నేడే..! ఈ సందర్భంగా ఆయన సాహిత్య జీవన ప్రయాణంలోకి ఓసారలా తొంగిచూసే చిరు ప్రయత్నం...
విశ్వంభర అంటే మానవుడు
విశ్వంభర అంటే భూమి, ప్రపంచం అని అర్థాలు. అయితే ఇది కేవలం భూగోళం అనే మట్టిముద్దను గురించిన కావ్యం కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని, వికాసాలను గురించి ఆ వికాసక్రమంలో ఆ మనిషి చైతన్యస్థాయి గురించి, ఈ చైతన్యానికి మూలమైన మట్టితో..


సినారెగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త. ఈయన తెలుగు సాహిత్యానికి చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988వ సంవత్సరంలో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమయిన "జ్ఞానపీఠ" అవార్డును అందుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితులయిన ఈయన రాసిన పాటలు తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామమైన హనుమాజీ పేటలో 1931వ సంవత్సరం, జూలై 29వ తేదీన జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీలను పొందారు. ఆ తరువాత ఉస్మానియాలోనే ఆచార్యుడిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే అంశమేంటంటే... సినారె డిగ్రీ వరకూ ఉర్దూ మాధ్యమంలోనే విద్యను అభ్యసించారట. అయితే ఆ తరువాత తెలుగు సాహిత్యాన్ని ఒంటబట్టించుకున్న ఆయన అనేక రచనా అద్భుతాలను సృష్టించారు. ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ అవార్డును పొందిన తెలుగు సాహితీకారుడు ఈయనే కావడం గర్వకారణం. ఈయన రాసిన "విశ్వంభర" అనే పద్య కావ్యానికిగానూ ఈ అవార్డు లభించింది.

సినారె "విశ్వంభర"ను రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. ఈ పద్య కావ్యాన్ని మొట్టమొదటిసారిగా 1980వ సంవత్సరంలో ముద్రించారు. ఈకావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ. స్థాయిలో పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి.

" విశ్వంభర" రచనపై ఎం.ఫిల్., పి.హెచ్.డి. పట్టాల కోసం పరిశోధనలు కూడా జరిగాయి. దీనిని హిందీలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్రలు అనువదించారు. కలకత్తా భారతీయ భాషా పరిషత్తు 'భిల్వారా' అవార్డును, త్రివేండ్రం కుమారన్‌ ఆసాన్‌ అవార్డును, సోవియెట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డులను కూడా ఈ గ్రంథం పొందింది.

ఈ రచనకుగాను పెద్ద ఎత్తున సాహితీ ప్రముఖులందరి ప్రశంసలను అందుకున్నారు సినారె. డాక్టర్ ఆచార్య ఎన్. గోపీ విశ్వంభర గురించి ఏమంటారంటే... "విశ్వంభర అంటే భూమి, ప్రపంచం అని అర్థాలు. అయితే ఇది కేవలం భూగోళం అనే మట్టిముద్దను గురించిన కావ్యం కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని, వికాసాలను గురించి ఆ వికాసక్రమంలో ఆ మనిషి చైతన్యస్థాయి గురించి, ఈ చైతన్యానికి మూలమైన మట్టితో అతని సంబంధాన్ని గురించి చెప్పేదే. ఆ మట్టే విశ్వంభర. ఆ విశ్వంభరే మానవుడు"

" నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, ఊరు సహజీవనం, తీరు సమభావనం....నా వచనం బహువచనం, నా వాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం..." అంటూ కవిత్వంలో తనను తాను పరిచయం చేసుకున్న సినారె గురించి చేరా ఇలా అంటున్నారు...

" ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్‌ స్ఫూర్తి. అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది. శబ్దాలకు రంగు, రుచి, వాసన కలిగించే ఆల్కెమీ ఏదో సినారె దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదంటూ" కవిత్వంపైన, కవిపైన తనకుండే అభిమానాన్ని చాటుకున్నారాయన.

" విశ్వంభర"లో ఆధునిక కవిత్వంలో ఉండే గందరగోళం ఏమాత్రం లేకుండా ప్రతి దృశ్యం పాఠకుల ముందు కదలాడుతూ ‘కాలయంత్రం’లా సాగిపోతూ... ఆ అనుభవాలతో తడిసిపోతుంది. కళాత్మకంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని అంశాలను స్పృశిస్తోన్న విశ్వంభర మరో మాటలో చెప్పాలంటే "మనసు కావ్యం". ఇంతటి గొప్ప కావ్యాన్ని తెలుగుజాతికి అందించిన మన సినారె ఎప్పటికీ అభినందనీయులే...!!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments