సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నిర్మాతగా వెలగడమే కాకుండా దక్షిణాది చలనచిత్రరంగాన్ని ఒక్క తాటిపై తీసుకువచ్చి వంద సంవత్సరాల సినీ వేడుకను కనుల పండుగా చేసిన ఘనత సి. కళ్యాణ్‌కే దక్కుతుంది. మరోవైపు రియల్ ఎస్టేట్‌రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ నలుగురి కోసం మనం అనే తను నమ్మిన సిద్ధాంతంతో ముందుగు సాగుతున్నారు. మరోవైపు పలు విమర్శల రాళ్ళుగా మీదకు వస్తున్నా ధీటుగా ఎదుర్కొంటూ తనలోని తప్పులేదని నిరూపిస్తున్నారు. బాలకృష్ణతో త్వరలో ఓ చిత్రాన్ని చేయనున్నాని చెబుతున్న ఆయన దర్శకుడు కావాలనే చిరకాల వాంఛ అతి త్వరలోనే నెరవేరుతుందన్న ఆనందాన్ని వ్య్తం చేస్తున్నారు. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ సారాంశం.
ఇయర్ ఎండింగ్‌కు వచ్చింది. ఇండస్ట్రీ ఎలా వుందనుకుంటున్నారు?
మామూలుగా నవంబర్ సినిమా ఇండస్ట్రీలో డల్ సీజన్. ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీ మనం ఇచ్చే కంటెంట్ మీద ఆధారపడి వుంటుంది. రిపీట్ ఆడియన్స్ సక్సెస్ మీదే ఆధారపడి వుంటుంది. అలాంటి కథలు కొన్నే వచ్చాయి. కొన్ని ఇలా వచ్చి అలావెళ్ళిపోయాయి.
యువతే సినిమాకు సరుకు. మీరు యూత్‌గా వున్నప్పుడు ఎలాంటివి లైక్ చేసేవారు?
కాలేజీ డేస్‌లో యూత్‌గా వుండే టైంలో బాగా ఫీలయి చూసిన సినిమా 'మరో చరిత్ర'. ఆ సినిమాలో వుండే ప్రేమ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ఈ రోజుల్లో లవ్‌కూ దానికీ చాలా తేడా వుంది. ఆ సినిమాలో ఫ్యామిలీ ఫీల్ వుంటుంది. రెండు కుటుంబాల మధ్య సంబంధాలు, భాషల మధ్య వుండే వ్యత్యాసంతోపాటు హృదయాన్ని టచ్ చేసే సన్నివేశాలు, సెంటిమెంట్ వున్నాయి. ఈమధ్య కాలంలో సూపర్‌హిట్ అయిన ఏ సినిమాల్లోనూ అలాంటివి లేవు. ఎన్ని తరాలు మారినా సెంటిమెంట్ ఒక్కటే కీలకం. కాలాన్ని బట్టి అవి చెబుతూనే వున్నారు.
'శతమానంభవతి' ఆడడానికి కారణమదే. అలాగే 'రంగస్థలం' కూడా. కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్ యుగంలో నిర్ణయాల్లో స్పీడ్ అనేది తేడా. ఫీలింగ్స్ సేమ్‌టు సేమ్. ఈరోజుల్లో ప్రేమ కంటే వ్యామోహం మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు 12 ఏళ్ళకే టీనేజ్ అంటున్నారు. దాంతో టీనేజ్ అర్థం మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే దాన్ని బేస్ చేసుకుని కథలు రాయాల్సివస్తుంది.
సోషల్‌మీడియాలో ఎంత ఫోకస్ చేస్తే సినిమా అంత బాగా పండుతుంది. 'మహానటి' చిత్రాన్ని తీసుకుంటే సావిత్రి ఇప్పటి యూత్‌కు తెలీదు. కానీ వారికే ఎందుకు కనెక్ట్ అయిందంటే.. ఇప్పుడు తరానికి తెలిసిన నటీనటుల్ని పెట్టుకోవడంతోపాటు సెంటిమెంట్ కనెక్ట్ అయ్యేట్లు చేశారు. సో. యూత్ అప్పుడు ఇప్పుడైనా సెంటిమెంట్ ఒక్కటే. టెక్నాలజీయే మారింది.
2.0 కూడా సెల్‌ఫోన్ మీద తీశాడు? అదెలా అనిపిస్తుంది?
శంకర్‌ను విమర్శిచడం కాదు కానీ.. 'రోబో' తీసినప్పుడు అవి అంతగా పాపులర్ కాలేదు. 'రోబో' సినిమా తర్వాత ఏడు సంవత్సరాలకు పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ ఆంగ్ల సినిమాల్లో చూసేశారు. ఆ సినిమా కొద్దిగా తేడా చేసినా శంకర్ తెలివి, కష్టం. చాలా గొప్పది. అయితే ఒకటి నిజం. ఇక రోబోలతో సినిమా తీస్తే ఇక చూడరు! అనేలా ప్రేక్షకులు వచ్చేశారు. టెక్నాలజీ లేని టైంలో అప్పట్లో విఠలాచార్య ఇలాంటి ట్రిక్స్‌తోనే తీశారు. 'అమ్మోరు' సినిమా తీసినప్పుడు గ్రాఫిక్స్ లేవు. అయినా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక 2.0 సినిమాను 3డిలో చూసిన ఫీలింగ్ 2డిలో సాటిస్ఫై కాలేకపోతున్నారు.
మిమ్మల్ని ప్రభావితం చేసిన దర్శకుడు ఎవరు?
'మరోచరిత్ర' బాలచందర్‌గారే. నెల్లురు మాధవ్ థియేటర్‌లో 100 రోజులకు గాను 95 రోజులు చూసేశాను. సినిమా చూసినంతసేపు ఎంటర్‌టైన్‌మెంట్‌గా వెళుతుంది. పతాక సన్నివేశం రాగానే మళ్ళీ చూడాలనిపించేది. అలా బాలచందర్ సినిమాతో మొదలైన నా ఇంట్రస్ట్ ఆయనతో స్టేజీని పంచుకునే స్థితికి ఎదిగాను. దాసరిగారు, రాఘవేంద్రరావు గారు కూడా. వారంతా సరస్వతీపుత్రులే. స్టార్ లేకుండా సినిమాలు తీసి హిట్ చేశారు. అల్లు అర్జున్‌తో రాఘవేంద్రరావు 'గంగోత్రి' తీసి సూపర్‌హిట్ చేశారు. అదీ దర్శకత్వం అంటే. ఇప్పుడు కొంతమంది బన్నీతో సినిమా తీసి ఇంత కలెక్షన్ చేశామని పేర్లు వేసుకోవడం గొప్పకాదు. ఈ రోజుకు వచ్చిన సౌకర్యాలతో ఎంతైనా తీయవచ్చు. ఆ రోజుల్లో కథ, కథనాన్ని నమ్ముకున్నారు.
సినిమాపై ఆసక్తికి కారణం?
కాలేజీలో నాటకాలు ఆడేవాడిని. ఎక్కువసార్లు 'ఊరమ్మడి బ్రతుకులు' చేశాను. మా మామగారికి రాజనాల స్నేహితుడు కావడం ఓ కారణం. అలాగే మోహన్ బాబుగారు కూడా. ప్రతి వేసవికి మోహన్ బాబు మా మామగారింటికి వచ్చేవారు. టీచర్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఎదగడం చూశాను. సినిమాపై ఆసక్తి చూసి సరైన గైడెన్స్ మోహన్‌బాబు ఇచ్చేవారు.
ఎన్‌టిఆర్ గారితో పరిచయం గురించి?
నేను సెల్ప్‌మేడ్‌గానే వచ్చాను. హాస్టల్‌లోనే చదువు. నెల్లూరులో స్నేహితుడు ద్వారా చెన్నై వెళ్ళి ఎన్‌టిఆర్‌ను చూసేవాడిని. ఆయన్ను చూసినప్పుడు ఎలా వుందంటే తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని చూసినట్లుగా ఫీలయ్యేవాళ్ళం. తిరుమలలో ఎవ్వరూ సరిగ్గా దేవుడ్ని చూడలేం. అలాగే ఆయన్ను కూడా. ఆ తర్వాత ఆయనతో 'లాయర్ విశ్వనాథ్' సినిమా స్థాయికి ఎదిగాను. ఇందుకు చాలా మంది స్నేహితులు సహకరించారు.
మీలో దూకుడు ఎక్కువని అంటుంటారు?
చదువుకునే రోజుల్లోనే డేర్‌గా వుండేవాడిని. నన్ను రెండు మూడుసార్లు ఎటాక్ చేసి చంపేయాలని చూశారు. ఎందుకంటే నేను మొండోడిని. సి.పి.ఎం. పార్టీకి చెందిన ఓ వ్యక్తితో గొడవపడి ఆ ఆఫీసు దగ్గరకి వెళ్ళి మూత్ర విసర్జన చేశా. తెలీనితనంతో ఏదో చేసేశాను. ఆ తర్వాత ఎవడైతో నాతో గొడవపడి చంపాలనుకున్నారో ఇప్పుడు వారంతా బాగానే వున్నారు. నా జీవితంలో బాధ కల్గించేది ఒక్కటే.. ఈ దూకుడు వల్ల ఆనం వివేకానందరెడ్డితో గొడవ. కాలేజీ డేస్‌లో ఆయన మా బాస్‌గా వుండేవాడు. అలాంటిది ఆయనతో తలపడాల్సి రావడం బాధాకరం. ఓ విషయంలో ఆయన్ను ఎదిరించేటపుడు చాలామంది అకాశానికి ఎత్తేవారు.
నాటకాల్లో నటించాక సినిమా రంగంలో ఆర్టిస్టుగా ఎందుకు ఎదగలేకపోయారు?
నాటకాల్లో నటించినా దర్శకత్వంపైనే మక్కువ వుండేది. కె. బాలచందర్, రాఘవేంద్రరావు. దాసరి చిత్రాలు చూసినప్పుడు వారి పేర్లలో 'మేఘం' చూసి నా పేరు కూడా అలా రావాలనే కోరిక వుండేది. అలాగే నాకు మంచి మిత్రుడు సుమన్. అప్పట్లో ఆయన్ను నిలబెడ్టటానికి నిర్మాతగా మారాను. అలా జర్నీ కొనసాగింది.
ఇప్పటికివరకు ఎన్ని సినిమాలు చేశారు?
ఇప్పటికి 76 సినిమా చేశా. సినిమా ఇండస్ట్రీలో డబ్బు పోగొట్టుకున్నాను. కానీ ఇక్కడే సంపాదించుకున్నా. అందుకే పోగొట్టుకున్నా ఫీల్‌కాను.
తొలి సినిమా అనుభవాలు?
నేను 'శ్రీమతి కావాలి' సినిమా మొదలు పెట్టినప్పుడు జేబులో డబ్బుల్లేవ్. కథ సత్యమూర్తి చెప్పాడు. సినిమా చేద్దాం అనుకున్నాం. వల్లభనేని జనార్దన్ దర్శకుడు. సిట్టింగ్‌కు మదరాసు ప్రెసిడెంట్ హోటల్‌లో 500 రూపాయలు అడ్వాన్స్ కట్టాలి. అది ఎవరో ఇస్తే కట్టాం. అలాగే సాంగ్ రికార్డింగ్ కూడా అదే పరిస్థితి. తెలిసిన ఆర్ట్ డైరెక్టర్ ఎవరి దగ్గరో డబ్బులు తీసుకువస్తే చేశాం. ఆ సినిమాకు మోహన్‌బాబు, రాధిక జంట. రాధికతో చిన్నపాటి గొడవ వుంటే ఆమెను ఒప్పించి మరీ చేయించాం. అప్పట్లో ప్రతీదీ ఫ్రెండ్స్ దగ్గర పోగుచేశాం. ఇంత అనుభవం రావడానికి తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర పనిచేయడం వల్ల వచ్చింది. అసిస్టింట్ డైరెక్టర్‌గా ఆయన దగ్గర పనిచేశా. ఆయన బేనర్‌లో 'ఇద్దరు కిలాడీలు' సినిమా చేశాం. ఆ సినిమా ఇలాంటి కష్టాల్లో తీశాం.
ఇప్పటి నిర్మాతల పరిస్థితి ఎలా వుందంటారు?
నిర్మాతల్లో చాలా మందికి ఏమీ తెలీదు. సూట్‌కేసుల్లో డబ్బులు తెచ్చి ఇవ్వడమే. క్యాషియర్ పాత్రే. నిర్మాత ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే నేరుగా ఆర్టిస్టులకు ఇచ్చేయాలి. మధ్యలో మేనేజర్లకు ఇవ్వకూడదు. దానివల్ల కొంత నష్టం కూడా వుంది. ఈ విషయాన్ని కొత్తవారు ఆలోచించాలి. అప్పట్లో నిర్మాత అంటే.. కథ, పాటలు, లొకేషన్లలో ప్రమేయం వుండేది. సలహాలు తీసుకునేవారు. హీరోలు పుచ్చుకునేవారు. ఇప్పటి రోజుల్లో నిర్మాత అనేవాడికి తీసే విధానం తెలీదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలీదు. ఎన్ని రోజుల్లో చేస్తున్నాననేది కూడా తెలీదు. పాత రోజుల్లో హీరో నిర్మాతను పిలిచి మీరు కంఫర్టబులా! అని అడిగేవాడు. ఈ రోజుల్లో అలాలేవు. నేను సేఫ్ కదా అనే హీరో ఆలోచిస్తున్నాడు. నిర్మాత దగ్గర దమ్ముంటే కాంబినేషన్‌తో తీసుకుని సొమ్ములు చేసుకోవడమే ఒక్కటే మార్గం. ఇప్పుడు కొత్తవారితో తీయాలంటే అభద్రత. తీశాక థియేటర్ కావాలంటే అడుక్కోవాల్సి వస్తుంది. ఈ విషయం తెలీక చాలామంది కొత్త నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు.
ఛాంబర్ ఈ విషయంలో కంట్రోల్ చేయలేదా?
ఛాంబర్ ఇలాంటి కంట్రోల్ చేయాలని చెబుతాం. కానీ ఎవ్వరూ ఆచరణలో పెట్టరు. మాకు బాగా తెలుసు అనే ధీమాతోనే వుంటారు. నేను ఛాంబర్ అధ్యక్షుడిగా వున్నప్పుడు ఆర్థికంగా నష్టపోయిన నిర్మాతలకు మెడిక్లెయిమ్ సౌకర్యం కల్పించాం. అది ఇప్పటికీ కొనసాగుతుంది. మాకు ముందు అధ్యక్షులుగా వున్న డివిఎస్ రాజు, రమేష్ ప్రసాద్‌లు చేసిన బైలా అప్పటికప్పుడు రాసుకున్నదే. ప్రస్తుతం దాన్ని మార్చాలి. గత నెల నుంచి ఏదో ఒకటి చేయాలనీ, బైలాను కొద్దిగా మార్చాలనుకుంటున్నాం.
దక్షిణాదిలో ఇతర భాషల విధానం ఛాంబర్ తీరు ఎలా వుంటుంది?
ఈ విషయంలో నా వరకు నేను గర్వంగా ఫీలవుతా. ఏకధాటిగా ఐదేల్ళు నేను సౌత్ ఇండియా ఛాంబర్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీరించా. ఒక్కోసారి ఒక్కో రాష్ట్రానికి ఆ పదవి ఇవ్వాలి. కానీ నన్నే కొనసాగించమని ఐదు రాష్ట్రాలవారు చెప్పడం అదృష్టం. దీనికి ఆదిశేషగిరిరావు, కెసి శేఖర్‌బాబు, డివిఎస్‌రాజుల ఆశీర్వదమే కారణం. దక్షిణాది ఛాంబర్ బిల్డింగ్ 30 ఏళ్ళ కల. మహామహులు కట్టాలని ప్రయత్నించారు. నాలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకరు అడ్డు చెప్పేవారు. అలాంటిది నేను చేసి చూపించాను అని చెప్పారు. -మురళీకృష్ణ