Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత కష్టం తెలిస్తే హీరోలు అన్ని విధాలా సహకరిస్తారు : విజయ్ ఆంటోనీ

డల్‌ ఫేస్‌, ఒకే ఎక్స్‌ప్రెషన్‌... అయినా వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్‌ ఆంటోని. 'నకిలీ', 'డా.సలీం' చిత్రాలు చేసినా రాని పేరు ఒక్క 'బిచ్చగాడు' సినిమాతో వచ్చింది. ఈ చి

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (16:46 IST)
డల్‌ ఫేస్‌, ఒకే ఎక్స్‌ప్రెషన్‌... అయినా వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్‌ ఆంటోని. 'నకిలీ', 'డా.సలీం' చిత్రాలు చేసినా రాని పేరు ఒక్క 'బిచ్చగాడు' సినిమాతో వచ్చింది. ఈ చిత్రంతో డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన  'భేతాళుడు' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సంగీతదర్శకుడిగా సినీ కెరీర్‌ను ప్రారంభించి హీరోగా మారిన ఆయన తమిళంలో నటించిన సినిమా 'యమన్‌'. దాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. తెలుగులో రవీందర్‌ రెడ్డి విడుదల చేస్తున్న ఈ చిత్రం ఈనెల 24న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
* అసలు 'యమన్‌' అంటే ఏమిటి?
చెడు పనులు చేసేవారికి 'యమన్‌' యముడులాంటి వాడు. యమన్‌ అంటే శివుడి అవతారం. ధర్మాన్ని కాపాడే యమధర్మరాజు. పురాణాల్లో కూడా యముడిని గొప్పగా చూపారు. ఈ సినిమాలో ఆ యముడిని కొత్త కోణంలో చూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో చెడు రాజకీయ నాయకులకు యముడు. కథప్రకారం అదే పేరు పెట్టారు.
 
* ఈ కథ మీకంటే మరో హీరోకు వెళ్ళింది. మరి మీకెలా వచ్చింది?
నిజమే. ముందుగా విజయ్‌ సేతుపతికి దర్శకుడు ఈ కథను చెప్పాడు. కానీ సేతుపతికి మూడేళ్ళ వరకు డేట్స్‌ ఖాళీలేవు. తను ప్రస్తుతం తమిళనాడులో ఉన్న బిజీ హీరోల్లో ఒకరు. దాంతో దర్శకుడు ఈ కథ నాకు చెప్పాడు. కథ నచ్చి నేను వెంటనే డేట్స్‌ ఇచ్చేశాను.
 
* రాజకీయనేపథ్యం అన్నారు. వాస్తవాల్ని టచ్‌ చేశారా?
ఇదొక పొలిటికల్‌ థ్రిల్లర్‌. ఇందులో ఎలాంటి నిజసంఘటనలకు తావులేదు. కథ మొత్తం కల్పితమే. గతంలో నేను చేసిన 'నకిలీ' సినిమాలాగే ఇది కూడా సృష్టించిన స్టోరీనే. తమిళ రాజకీయాలు దీనికి పొంతనేలేదు.
 
* రాజకీయాలు వద్దని చెబుతున్నారా?
కథ ప్రధానంగా రాజకీయం కాబట్టి అసలైన రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. ఒక సామాన్యుడు మంత్రిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమాలో ప్రధాన అంశం.
 
* ఇంతకుముందు ధనుష్‌ చేసిన సినిమాకూ దీనికి తేడా ఏమిటి?
ధనుష్‌ చేసిన చిత్రానికి దీనికి చాలా తేడా వుంది. అందులో ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు. సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎలా అయ్యాడనేది పాయింట్‌. కానీ ఇందులో నాన్న చేయలేని పనిని కొడుకు ఎలా చేసిసాధించాడు అన్నదే పాయింట్‌. తండ్రీ కొడుకుల్లా ఇందులో నటించాను. 
 
* తమిళనాడు రాజకీయాల ప్రస్తావన ఉంటుందా?
ప్రత్యేకంగా వాటి గురించి ఏమీ చెప్పలేదు. ఐదేళ్ల క్రితమే ఈ కథ తయారైంది. ఇప్పటి తమిళ పరిస్థితులకు, సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కథ అన్ని రాష్ట్రాల రాజకీయాలను టచ్‌ చేస్తుంది.
 
* 'భేతాళుడు' ఫెయిల్యూర్‌కు కారణమేమిటి?
 
మంచి సబ్జెక్ట్‌. కానీ సరిగా ఆడలేదు. సినిమా రిలీజయ్యాక మేం చేసిన తప్పేమిటో తెలిసింది. అదేంటంటే విలన్లని ఫస్టాఫ్‌‌లోనే పరిచయం చేసి ఉండాల్సింది. కానీ అలా చేయకపోవడంతో ఫస్టాఫ్‌లో చెప్పిన జయలక్ష్మి పాత్ర వెనుక పెద్ద థ్రిల్లింగ్‌ కథ ఉంటుందని ఆడియన్స్‌ అనుకున్నారు. కానీ రెండో భాగంలో అలా లేదు. దాంతో ఫలితం ఆశించిన మేరకు ఆడలేదు. కానీ తమిళంలో మాత్రం మొదటి నాలుగు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చేశాయ్‌.
 
* తొలిసారిగా రాజకీయాన్ని టచ్‌ చేశారు. ఏవైనా ఒత్తిడులు వచ్చాయా?
ఎలాంటి వత్తిడులులేవు. కథ కల్పితం. 
 
* మరలా ఇలాంటివే చేస్తారా?
కథ బాగుంటే పొలిటికల్‌ డ్రామా సినిమాలు వరుసగా చేస్తాను. సాధారణంగా ఒకే తరహా సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్‌ కొడుతుందంటారు. కానీ మంచి కథ, స్క్రీన్‌ ప్లే ఉంటే ఒకే తరహా సినిమాలనైనా ఆడియన్స్‌ ఆదరిస్తారు.
 
* సంగీత దర్శకుడిగా సంగీత నేపథ్య సినిమా చేసే ఆలోచన వుందా?
అలా అని ఏమీ అనుకోలేదు. సంగీత నేపథ్యం తీసుకున్నా కథ బాగుండాలి. ముందుగా నేను కథకే ప్రాధాన్యత ఇస్తాను. ఆ తర్వాతే సంగీతం.
 
* నటనతో పాటు నిర్మాణాన్ని కూడా చేపట్టారు. రెండూ ఒకేసారి చేయడం ఎలా అనిపిస్తుంది?
నటుడు ప్రొడక్షన్‌ చేస్తే అతనికి నిర్మాత కష్టమేమిటో తెలుస్తుంది. ప్రొడక్షన్‌ చేయడం సామాన్యమైన విషయం కాదు. సినిమా చేసి, ప్రమోషన్‌ చేసి, డిస్ట్రిబ్యూషన్‌ చేసి చివరికి రిలీజ్‌ చేసేదాకా నిర్మాత కష్టపడాలి. ఒకసారి నిర్మాత కష్టం తెలిస్తే హీరోలు కూడా అన్ని విషయాల్లోనూ వారికి సహకరిస్తారు.
 
* మరి నటన మీద ఎలాంటి ప్రభావం చూపలేదా?
అన్నింటినీ కథ ఓవర్‌ టేక్‌ చేస్తుంది. నా వరకైతే ఒక కథాపరమైన సినిమాకి నటుడు ఎలా ఉన్నాడనేది అవసరం లేదు. అందుకే ఫిజిక్‌ గురించి నేను పెద్దగా పట్టించుకోను. గ్లామర్‌ కోసం కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోను. చాలా మంది అడుగుతుంటారు మీరు ఫిజిక్‌ ఎలా మైంటైన్‌ చేస్తుంటారని.
 
* మీలో మైనస్‌ల్ని కనిపెట్టారా?
సంగీతదర్శకుడికన్నా నటించడమే సులువుగా ఉంటుంది. అందరూ చాలా ఈజీగా గుర్తుపడతారు. నటుడిగా ఉంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి. అన్నీ టైంకి జరుగుతాయి. గౌరవం, మంచి ఆదాయం ఉంటాయి. మనం పర్సనల్‌గా తెలీకపోయినా చాలా మంది మనల్ని ప్రేమిస్తారు. అయితే నేను గొప్ప నటుడిని కాదు. డల్‌ఫేస్‌తో ఒకే ఎస్‌ప్రెషన్‌ ఇస్తున్నాడనే కామెంట్స్ నాకు వద్దకు వచ్చాయి. వాటిని కవర్‌ చేసేందుకే మంచి కథలు ఎంచుకుంటాను. అదే నాలోని మైనస్‌ పాయింట్స్‌ని కవర్‌ చేస్తుంది.
 
* 'బిచ్చగాడు' తర్వాత మీలో వచ్చిన మార్పు?
బిచ్చగాడు తెలుగు, తమిళంలో పేరుతోపాటు డబ్బూ వచ్చింది. అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ నేను మాత్రం మారలేదు. ఒకసారి ఒక సినిమా మాత్రమే చేస్తాను. అందరి దగ్గరా డబ్బు తీసుకుని నేను ఇబ్బందిపడి వారిని ఇబ్బంది పెట్టను. ఎప్పటికీ ఒకేలానే ఉంటాను. డబ్బు గురించి పెద్దగా పట్టించుకోను. డబ్బే ప్రధానం అయితే బిచ్చగాడులోని చివరి సీన్‌కు వచ్చేస్తాం. అందుకే వచ్చిన ఆదాయంలోనే కొంత సమాజసేవ చేయడానికి ప్రయత్నిస్తుంటా.
 
* తెలుగులో సినిమా అన్నారు?
అవును. తెలుగు, తమిళ రెండూ ఒకేసారి షూట్‌చేసే చిత్రం చేయబోతున్నా. అది కూడా ఎక్కువ ఆంధ్ర, తెలంగాణాల్లోనే చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments