వెన్నెల తర్వాత ప్రస్థానం చిత్రం తీసి.. ఒక్కసారిగా మాస్ యాక్షన్ చిత్రం తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవకట్టా... ఆ తర్వాత ఆటోనగర్ సూర్య చిత్రాన్ని తీసి దెబ్బతిన్నాడు. ఆ చిత్రం పెద్దగా ఆయనకు పేరు తేలేదు. మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని మంచు విష్ణుతో 'డైనమైట్' పేల్చబోతున్నాడు. మరి అది ఎలా పేలుస్తాడో, అసలు పేల్చడో ఆయన మాటల్లో చూద్దాం. విష్ణు, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు దేవాకట్టతో జరిపిన ఇంటర్వ్యూ.
ఆటోనగర్ సూర్య ఎటువంటి పాఠాలు నేర్పింది?
ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి కామన్. మన పని పూర్తిగా చేశామా లేదా? అనేది కీలకం. కష్టం ఎక్కడికి పోదు. ఆ చిత్రం చేయడానికి చాలా రోజులు పట్టింది. కొన్ని కారణాల వల్ల ఏడాదికి పైగా పట్టింది. ఏదైనా తప్పులు వున్నాయి అంటే అవి సరిచేసుకోవడానికి ఉపయోగపడతాయి.
మరి డైనమైట్ త్వరగా తీసేశారే. కారణం?
మామూలుగా నేను సినిమాలు చాలా ఫాస్ట్‌గా తీస్తుంటాను. 'వెన్నెల' 60 రోజుల్లోనూ, 'ప్రస్థానం' 65 రోజుల్లో పూర్తిచేశాను. కానీ ''ఆటోనగర్ సూర్య'' పరిస్థితి వేరే. కర్ణుడి చావుకు కారణాలు చాలా అంటారు. ఆ సినిమాకు అదే అయింది. 'డైనమైట్' కూడా 56 రోజుల్లో పూర్తి చేసాం. నా ప్రతి సినిమాను విడుదల చేయాలనుకొన్న రెండుమూడు నెలల తర్వాతే థియేటర్లలో విడుదలవ్వగలిగింది. ఇది కూడా త్వరగా విడుదల కావాలి. కానీ ''బాహుబలి, శ్రీమంతుడు'' చిత్రాలు విడుదలవడంతో గ్యాప్ పెరిగింది. మంచి గ్యాప్ చూసుకొని సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.
''ఆటోనగర్ సూర్య'' మీ కారణంగానే బడ్జెట్ పెరిగిందనే వార్తలు వచ్చాయి?
అవన్నీ అసత్య ప్రచారాలు. మా ప్రొడ్యూసర్స్ కూడా ఒక మీడియా సమావేశంలో ''మా సినిమాకి 25 కోట్లు బడ్జెట్ అయ్యింది'' అని చెప్పడం నాకు నచ్చలేదు. నిజానికి ''ఆటోనగర్ సూర్య'' సినిమాని 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాను. నా దృష్టిలో ''ఆటోనగర్ సూర్య'' సినిమా ''వెల్ రిటన్ స్క్రిప్ట్ అండ్ బ్యాడ్లీ ఎగ్జిక్యూటెడ్ ఫిలిం''.
మరి ఆయన ఎందుకలా చెప్పారు?
నా ప్రతి సినిమాకి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంటుంది. ఆ సమయంలో కొత్త కథలు రాసుకొంటుంటాను. అయితే, నా వైఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ నాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తుండటం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇన్నాళ్ళ కెరీర్లో ఎప్పుడైనా అసంతృప్తి కలిగిందా అని ప్రశ్నిస్తే ''లేదు'' అని నిక్కచ్చిగా చెబుతాను. సినిమా పట్ల నాకున్న ప్యాషన్‌తోనే ఇటు వచ్చాను.
డైనమైట్ ఏ తరహా సినిమా?
ఇది యాక్షన్‌తో కూడిన హైటెన్షన్ ఫిలిం. ఇందులో మలుపులు వుంటాయి. అవి ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తుంటాడు. ఇంగ్లీష్‌లో వచ్చిన ''ఎనిమి ఆఫ్ ది స్టేట్, మిషన్ ఇంపాజబుల్'' వంటి సినిమాలు చూస్తున్న ప్రేక్షకుడు ఏ విధమైన అనుభూతిని పొందుతాడో, మా ''డైనమైట్'' చూసిన ప్రేక్షకులకూ అదేవిధమైన అనుభూతిని కలింగించాలన్నది నా ప్రయత్నం.
అంటే ఈ సినిమా తమిళ రీమేక్ కదా?
అవును. 'అరిమ నంబి' చిత్రాన్ని చూడమని విష్ణు నాకు చెప్పాడు. చూశాక.. బాగా నచ్చింది. అందులో పాత్రలు చాలా కనెక్ట్ అయ్యాయి. విష్ణుకు కరెక్ట్‌గా సరిపోతుందనిపించింది. అయితే ఇది తమిళ రీమేక్ అయినా.. ఇంగ్లీషులోని థ్రెడ్‌ను మాత్రమే తీసుకున్నాను. కథ సిద్ధం చేసుకొనేప్పుడు మంచు విష్ణు నాకు ఇచ్చిన ఫ్రీడం అలాంటిది. ఎప్పుడూ నన్ను కంగారు పెట్టలేదు.
అంతగా నచ్చిన అంశమేమిటి?
నేను ఏ కథను సిద్ధం చేసుకొన్నా ఆ కథకు కనెక్ట్ కాలేకపోతే ఆ సినిమాను చేయలేను. అయితే ఈ సినిమా కథ నాది కాకపోయినా.. ఆ కథలో హీరో క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. అందుకే ''అరిమ నంబి'' సినిమాను రీమేక్ చేయడానికి ఒప్పుకొన్నాను. ముఖ్యంగా ఈ సినిమాలోని కథాంశం ప్రెజంట్ జనరేషన్ యూత్‌కు బాగా అలవాటైన సోషల్ నెట్వర్కింగ్ మరియు కాంటెంపరరీ ఇష్యుస్పై ఉంటుంది.
విష్ణు కొత్త లుక్ అని ప్రచారం చేశారు. ఫీడ్‌బ్యాక్ ఎలా వుంది?
తను.. శివాజీ కృష్ణ అనే నవతరం యువకుడి పాత్రలో కనిపిస్తాడు. 10 టు 6 జాబ్ చేసుకొని, సాయంత్రం కాసేపు అలా బయట తిరిగి ఇంటికి చేరుకోవడం అతని దినచర్య. అనుకోకుండా కలిసిన హీరోయిన్ను ఇష్టపడ్డ కృష్ణ, ఆ తర్వాత ఆమెకు వచ్చిన సమస్యను తన సమస్యలా భావించి, ఆ సమస్యను ఏవిధంగా ఎదుర్కొన్నాడు, ఆ సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటి?, ఈమధ్యలో హీరోయిన్ ప్రేమను ఎలా గెలుచుకొన్నాడు? అనేది క్లుప్తంగా ''డైనమైట్'' కథ. అనామిక పాత్రలో ప్రణీత కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొంటుంది. ఇక విష్ణు అయితే ఈ సినిమాలో ఒక చేతిపై టాటూతో, చెవిపోగుతో, రఫ్ బియర్డ్‌తో ట్రెండీ లుక్‌తో అదరగొడతాడు. విజయ్ మాస్టర్ నేతృత్వంలో రూపొందిన యాక్షన్ ఎపిసోడ్స్‌లో విష్ణు, ప్రణీత డూప్స్ లేకుండా పెర్ఫార్మ్ చేసారు.
బాహుబలిలో థాంక్స్ కార్డు వేసారు ఎలా ఫీలయ్యారు?
''బాహుబలి'' సినిమాలో టైటిల్స్‌లో ''థాంక్స్'' కార్డ్ కింద నా పేరు చూసినవాళ్లందరూ ఆ సినిమాకి నేను చాలా డైలాగ్స్ రాసానని అనుకొంటున్నారు. నిజానికి ''బాహుబలి'' సినిమాలో వార్ సీక్వెన్స్‌కు ముందు ప్రభాస్ మాట్లాడే వెర్షన్‌ను మాత్రమే నేను రాశాను. నా ''ఆటోనగర్ సూర్య'' డైలాగ్ టీజర్‌ను విన్న రాజమౌళి గారు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. అయితే, సినిమాలో నాకు స్పెషల్‌గా ''థ్యాంక్స్'' కార్డ్ వేయడం అన్నది రాజమౌళి గారి సంస్కారం.
తదుపరి చిత్రాలు?
తదుపరి సినిమా ఏంటి అన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కొన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే, ''డైనమైట్'' సినిమా సక్సెస్‌ను బట్టి అవి ఫిక్సవుతాయి. కాకపోతే, ఓ నాలుగు కథలు సిద్ధం చేసుకొన్నాను. అవి త్వరలో చెబుతాను అన్నారు.