Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద పుడింగిననే ఫీలింగ్ నాలో ఎప్పుడూ వుండదు: రాజమౌళి

Webdunia
శనివారం, 8 జనవరి 2011 (11:26 IST)
WD
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎనిమిది చిత్రాలతో.. అవి కూడా వరుసగా విజయాలు సాదించడమంటే మాటలా? అంతకు ముందెప్పుడో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు వరుసగా 12 విజయాలందుకున్నారని చెబుతారు. కానీ ఇటీవల కాలంలో ఈ ఫీట్‌ను సాధించిన దర్శకులెవరూ మనకు కనిపించరు.

' స్టూడెంట్‌ నెం.1'తో మొదలైన రాజమౌళి దర్శకయాత్ర 'సింహాద్రి' చిత్రంతో జైత్రయాత్రగా మారి.. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే వుంది. సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న ఒక సినిమాతో ఒక సినిమాకు పోలిక లేకుండా, రూపొందించిన ప్రతి సినిమాతో సంచలన విజయంసాధించడం ఒక ఎత్తయితే, 'ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలన్న' ఆర్యోక్తిని నరనరాన అణువణువునా జీర్ణింపజేసుకుని ఎంతో అణకువగా ఉండడం మరొక ఎత్తు. అటువంటి స్టార్ దర్శకుడు రాజమౌళితో వెబ్‌దునియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్రశ్న: మీ గురించి క్లుప్తంగా వివరిస్తారా?
జ: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి ఇవతల ఒడ్డున గల పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మా స్వస్థలం. సినిమాలంటే చిన్నప్పటి నుంచి బీభత్సమైన ఇష్టం. ఎన్టీఆర్‌ సినిమా రిలీజయ్యిందంటే చాలు వరసబెట్టి చూస్తూనే వుండేవాడిని. ముఖ్యంగా రియాక్షన్‌ సినిమాలంటే పడి చచ్చేవాడ్ని.

ప్రశ్న: సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
జ: నాకు కొంచెం ఊహ తెలిసేసరికే నాన్నగారు (విజయేంద్రప్రసాద్‌) సినిమా రంగానికి వచ్చేశారు. రైటర్‌గా ఆయన నిలదొక్కుకున్నాక, ఆయన దగ్గరే సహాయకుడిగా (అసిస్టెంట్‌ రైటర్‌గా) పనిచేయడం ప్రారంభించాను. రైటర్‌గా నాన్నగారు బొబ్బిలిసింహం (బాలకృష్ణ), బంగారు కుటుంబం (ఎఎన్‌ఆర్‌ - దాసరి) వంటి సూపర్‌హిట్స్‌ ఇవ్వడంతో ఆయనకు చాలా మంచి డిమాండ్‌ ఉండేది. నాన్నగారితో పాటు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి వంటి దర్శకులందరినీ కలుస్తుండేవాడిని. ఆరకంగా వాళ్ళతో నాకు ఎంతో కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావుగారి దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత రాఘవేంద్రరావుగారి దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అయ్యాను. 'శాంతి నివాసం' సీరియల్‌కు రాఘవేంద్రరావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తే ప్రాక్టికల్‌గా డైరెక్షన్‌ నేను చేసేవాడ్ని.

ప్రశ్న: సీరియల్స్‌ డైరెక్షన్‌ చేస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా వుండేవి?
జ: రాఘవేంద్రరావుగారు ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్లు ఇచ్చిన డైరెక్టర్‌ కాబట్టి నా కాన్‌సన్‌ట్రేషన్‌ మొత్తం ఆయన్ని మెప్పించడం పైనే ఉండేది. మిగతా విషయాల గురించి పెద్దగా పట్టించుకునేవాడ్ని కాదు. ఆయన తీయమన్నట్లు తీయడం, లేదా ఆయనకు నచ్చేట్లుగా తీయడం పైనే నా దృష్టి పెట్టేవాడ్ని.

ప్రశ్న: దర్శకుడు కావాలన్న ఆలోచన మీలో ఎప్పుడు కలిగింది?
జ: నాన్నగారి దగ్గర అసిస్టెంట్‌ రైటర్‌గా పనిచేసేటప్పుడు. రోజుల తరబడి చర్చించుకుని మేము కథను సిద్ధంచేసి డైరెక్టర్స్‌కు చెబుతుండే వాళ్ళం. కానీ సినిమా రిలీజయ్యాక చూసుకుంటే మేం చెప్పింది ఒకటి, తీసింది ఒకటి అన్నట్లుగా ఉండేది. మేం చెప్పినట్లుగా ఎందుకు తీయలేదు అలా తీసుంటే సినిమా హిట్‌ అయి వుండేది కదా అని బాధపడుతుండే వాడ్ని. అయితే నేను డైరెక్టర్‌గా మారాక ఇప్పుడు తెలుస్తోంది. ఒక రైటర్‌కున్న విజన్‌ని ఓన్‌ చేసుకుని విజువలైజ్‌ దానిని బిగ్‌ స్క్రీన్‌పైకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎంత కష్టమో. ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వడమన్నది అంత ఆషామాషీ కాదని ఇప్పుడు నాకు తెలిసింది. అయితే అప్పటికి నాకు తెలియదు కాబట్టి, నేనే డైరెక్టర్ని అయితే అనుకున్నది అనుకున్నట్లుగా తీసుండేవాడిని కదా? అనిపించేది. ఆవిధంగా దర్శకుడు కావాలన్న ఆలోచన నాలో మొలకెత్తి అది చివరికి మహావృక్షంగా మారింది.

ప్రశ్న: దర్శకుడిగా మారడానికి ముందు మీరు స్ట్రగుల్‌ అయిన సందర్భాలేమైనా ఉన్నాయా?
జ: దర్శకుడు కావడానికి నేను పెద్దగా స్ట్రగుల్‌ అయిన సందర్భాలేమీ లేవు కానీ ఒకటి రెండు సంవత్సరాల పాటు ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు మాత్రం ఎదుర్కొన్నాను. రైటర్‌గా బాగా సక్సెస్‌ అయ్యాక నాన్నగారు తనే దర్శకుడుగా, నిర్మాతగా 'అర్ధాంగి' అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రానికి నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ చిత్రం అనూహ్య రీతిలో మేమెవరం ఊహించని విధంగా అట్టర్‌ఫ్లాప్‌ అయింది. దాంతో కొన్నాళ్ళు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఎంతగా అంటే ఫస్ట్‌ తారీఖు వస్తోందంటే అద్దె కట్టగలమో లేదో అని భయపడేంతగా గడచిన గడ్డు రోజులవి. అప్పట్లో మేము వాయిదాల పద్ధతిలో టీవీ కొనుక్కున్నాం. వాయిదా కట్టకపోతే ఇంట్లోంచి టీవీ తీసుకుపోతారేమో అని కూడా భయపడ్డ రోజులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. టీవీ తీసుకుపోతారనే భయంకంటే, టీవీ తీసుకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వారు చూస్తే పరువు పోతుంది కదా అని ఎక్కువ భయపడుతుండే వాళ్ళం. ఆ పీరియడ్‌ను మినహాయిస్తే దానికి ముందు కానీ తర్వాత కానీ నేను మరీ స్ట్రగుల్‌ అయిన సందర్భాలు లేవనే చెప్పాలి.

ప్రశ్న: 'స్టూడెంట్‌నెం.1' సినిమాకు డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చినప్పటి మీ అనుభూతుల్ని పంచుకుంటారా?
జ: 'స్టూడెంట్‌ నెం.1' సినిమాను రాఘవేంద్రరావుగారి దర్శక పర్యవేక్షణలో ముగ్గురు దర్శకులతో డైరెక్ట్‌ చేయించాలని మొదట అనుకున్నారు. ముగ్గురు దర్శకుల్లో ఒక దర్శకుడిగా నన్ను ఎంచుకున్నారు. కాబట్టి నేను మరీ అంత ఎగ్జయిట్‌ అవ్వలేదు. పైగా ఆ సినిమాలో హీరోగా తారక్‌(ఎన్టీఆర్‌)ను సెలక్ట్‌ చేసి, ఇతనే ఈ సినిమా హీరో అని చెప్పడం నాకు నచ్చలేదు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇతనితో నా ఫస్ట్‌ సినిమా ఏమిట్రా బాబూ అనుకున్నాను కూడా. అయితే షూటింగ్‌ స్టార్టయ్యాక కానీ తారక్‌లో సూపర్‌స్టార్‌ మెటీరియల్‌ ఉందని నాకు తెలియలేదు. తారక్‌ తెలివితేటలు, అతని జ్ఞాపకశక్తి, సినిమా పట్ల అతనికున్న ప్యాషన్‌, డెడికేషన్‌ చూసి చాలా ఆశ్చర్యపోతుండేవాడ్ని.

ప్రశ్న: ఒక శిష్యుడిగా మీ గురువు రాఘవేంద్రరావుగారిలో మీకు నచ్చిన క్వాలిటీ, నచ్చని క్వాలిటీ ఏమిటో చెబుతారా?
జ: నచ్చనివంటూ పెద్దగా ఏమీలేవు కానీ, చిన్న కంప్లయింట్‌ లాంటిది చెప్పమంటే చెబుతాను. స్టోరీని ఆయన చాలా సింపుల్‌గా తేల్చేస్తుంటారు. కథలో బలం లేకుండా, కథనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా చివరికొచ్చేసరికి తేలిపోతుందనేది నా అభిప్రాయం. ఇకపోతే ఆయనలో నాకు బాగా నచ్చేది ఆయన టేకింగ్‌. ముఖ్యంగా క్లోజప్‌లు ఎవరిపై ఎప్పుడు ఎలా పెట్టాలనేది ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.

ప్రశ్న: ఇప్పటివరకు మీరు తీసిన సినిమాల్లో మీరు చూసుకునేటప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యే సీన్‌ ఏమిటి?
జ : చాలా గర్వంగా అని చెప్పను గానీ 'యమదొంగ' సినిమాలో యముడి గెటప్‌లో తారక్‌ తొలిసారిగా పొగలు చీల్చుకుంటూ రాజసం ఉట్టిపడుతూ నడుచుకుంటూ వచ్చే సన్నివేశాన్ని చూసినప్పుడు నేను కొంచెం గర్వంగా ఫీలవుతుంటాను. ఎలా నడిచి రావాలో నేను నటించి చూపించాను తారక్‌కి. నేను చెప్పినదానికి పదిరెట్లు ఇంప్రొవైజేషన్‌ చేసి ఆ సీన్‌ను తారక్‌ రక్తికట్టించారు.

ప్రశ్న: మీ విజయంలో మీ జీవిత భాగస్వామి రమగారి భాగస్వామ్యమెంత?
జ: ఇంత పర్సెంటేజ్‌ అని చెప్పలేను కానీ ఆమె ప్రోత్సాహం, సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు లేకపోతే ఖచ్చితంగా నేనిప్పుడున్న స్థాయిలో ఉండేవాడ్ని కాదని మాత్రం చెప్పగలను. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నేను ప్రతిదానికి రమ మీద ఆధారపడతాను. పైగా నాకు చిరాకులు పరాకులు చాలా ఎక్కువ. పాపం తను చాలా ఓపిగ్గా అవన్నీ భరించి నాకు కావలసినవన్నీ అమరేలా శ్రద్ధ తీసుకుంటుంది, శ్రమ పడుతుంది.

ప్రశ్న: ఇప్పుడు అందరూ మిమ్మల్ని అపజయం ఎరుగని అసాధారణ దర్శకుడని, అదని ఇదని ఆకాశానికెత్తేస్తున్నారు కదా! మరి మిమ్మల్ని మీరు ఎలా అంచనా వేసుకుంటారు?

జ: మొహమాటంతో కాదు మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఒక దర్శకుడిగా నేను సాధించింది గోరంత, సాధించాల్సింది కొండంత అని నేను విశ్వసిస్తాను. నేను ప్రస్తుతానికి చెడ్డ దర్శకుడ్ని కాదని మాత్రమే అనుకుంటాను తప్ప, పెద్ద పుడింగిననే ఫీలింగ్‌ నాలో ఎప్పుడూ వుండదు. అయామ్‌ నాట్‌ ఎ బ్యాడ్‌ డైరెక్టర్‌. ఎట్‌ ది సేమ్‌టైమ్‌ అయామ్‌ ఆల్సో నాట్‌ ఎ గుడ్‌ డైరెక్టర్‌. ఒక మీడియం రేంజ్‌ డైరెక్టర్‌గా మాత్రమే నన్ను నేను అంచనా వేసుకుంటాను.

ప్రశ్న: ఒక డైరెక్టర్‌గా పీక్‌ స్టేజ్‌లో వున్న మీరు 'ఈగ'లాంటి ప్రయోగాత్మక చిత్రం చేస్తుండడానికి గల కారణమేంటి?
జ: డైరెక్టర్‌గా పీక్‌ స్టేజ్‌లో ఉన్నానని నేను భావించడం లేదని ఇప్పుడే చెప్పాను కదా! 'ఈగ' సబ్జెక్ట్‌ను మా ఫాదర్‌ చాన్నాళ్ళ క్రితమే తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్లుగా కొద్దిపాటి మార్పులు చేసి 'ఈగ' రూపొందిస్తున్నాం.

ప్రశ్న: ప్రభాస్‌తో మీరు రూపొందించనున్నారంటూ ప్రచారంలోకి వచ్చిన 'విశ్వామిత్ర' గురించి చెబుతారా?
జ: 'ఈగ' తర్వాత ప్రభాస్‌తో నేను సినిమా చేయబోతున్న మాట వాస్తవమే గానీ, ఆ సినిమా పేరు 'విశ్వామిత్ర' అని, దాని నిర్మాణం కోసం 50 కోట్లు ఖర్చవుతుందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదు. కథే ఇంకా ఫైనలైజ్‌ కానప్పుడు టైటిల్‌ను, బడ్జెట్‌ను ఎలా ఫైనలైజ్‌ చేస్తాం అంటూ ముగింపు పలికారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

Show comments