అమెరికాలో మన ఎన్నారైలకు ఏమైంది? జాతి వివక్షా దాడులకూ వాళ్లే బలవుతున్నారు. రంగు భేదంతో బయట కనిపిస్తే చాలు దాడులకు దిగడమే కాకుండా సవాలు చేసి మరీ కాల్చిపడేస్తున్నారు. మరోవైపున డాలర్లతో జీవితాన్ని పండించుకోవాలని నిజాయితీగానే శ్రమించి బతకాలని కొండంత ఆశలను ముందుంచుకుని వెళ్లిన వారూ అక్కడ బతకలేక, ఒత్తిడి తట్టుకోలక నిలువునా ఆశలు వ్రయ్యలు చేసుకుని తమవాళ్లను అనాథలను చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మొన్న కూచిభట్ల శ్రీనివాస్, నిన్న ఎన్నారై తల్లీ కుమారుల దారుణ హత్య, ఇవ్వాళ మరో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. బతకడం కోసం భూతల స్వర్గంకు వెళ్లినవారు బతుకు చాలించుకుంటున్నారు. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధురెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సియాటెల్లో సాప్ట్‌వేర్ ఇంజినీర్గా పనిచేసున్న మధురెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా రాళ్ల జనగామ. మధురెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.
మధురెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు కానీ, వివాదాలు కానీ లేవని బంధువులు చెబుతున్నారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై స్పష్టత లేదు. మధురెడ్డి బలవన్మరణంతో అతని స్వస్థలంలో విషాదం నెలకొంది.