కరోనా విషయంలో ప్రపంచాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ ఆ సంస్థకు ఇస్తూ వచ్చిన నిధులను అమెరికా నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తప్పుబట్టారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచానికి ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత పరిస్థితుల్లోనే డబ్ల్యూహెచ్ఓ అవసరం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులను ఆపివేయడం ప్రమాదకరమైన నిర్ణయమన్నారు.
డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న కృషి వల్లే కరోనా విస్తరణ నెమ్మదిస్తోందని... ఆ సంస్థ పనిచేయడాన్ని ఆపేస్తే... మరే ఇతర సంస్థ దాని స్థానాన్ని భర్తీ చేయలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఒక దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తూ నిధులు ఆపుతూ నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం మంచిదికాదని ఆయన చెప్పారు.