ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ దేవరకొండ ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతటి స్పందన వచ్చిందో.. యూత్‌ని ఎంతలా ఆకట్టుకుందో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. బడా నిర్మాతలు కూడా వీరితో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత మహానటి సినిమాలో ఆంటోనీ పాత్రలో నటించి మెప్పించాడు.
జీఏ2 పిక్చర్స్ బ్యానర్లో పరశురామ్ డైరెక్షన్లో నటించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో అనతి కాలంలోనే విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌లో నటించిన నోటా సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నటించిన టాక్సీవాలా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మరో విజయం సొంతం చేసుకున్నాడు. అయితే.. ఆతర్వాత విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని సౌత్‌లో ఉన్న భాషల్లో రిలీజ్ చేసారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈసారి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేసాడు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ.. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. ఇక విజయ్ దేవరకొండ ఆశలన్నీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న లైగర్ సినిమా మీదే. ఈ సినిమాని పూరి - ఛార్మి - కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది.
ఈ సినిమా తర్వాత నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ మూవీ తర్వాత విజయ్‌తో సినిమాలు చేసేందుకు కొంత మంది టాలీవుడ్ డైరెక్టర్స్ ట్రై చేస్తున్నారు. అయితే... విజయ్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ డైరెక్టర్స్ ఆలోచనలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... పూరితో చేస్తున్న లైగర్ మూవీ రిలీజయ్యే వరకు ఏ తెలుగు డైరెక్టర్‌కి సినిమా చేస్తానని మాట ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడని టాక్.
కారణం ఏంటంటే.. లైగర్ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో బడా ఆఫర్స్ వస్తాయని.. కరణ్ జోహర్ అప్పుడే వేరే సినిమాలు కమిట్ కావద్దని చెప్పడంతో విజయ్ ప్రస్తుతం కథలు వినడం లేదని.. ఎవరికీ సినిమా చేస్తానని మాట ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో విజయ్ సినిమా చేయడం కోసం కథలు రెడీ చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్స్ ఆలోచనలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. అదీ సంగతి..