కరోనా భయాందోళనల నేపథ్యంలో 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఆఫ్ఘనిస్థాన్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
రక్తపాతం ముగించేందుకు 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు లోయా జిర్గా ఆమోదం తెలిపిందని అసెంబ్లీ ఒక తీర్మానంలో తెలిపింది. రాజధాని కాబూల్‌లో అఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అసెంబ్లీని సమావేశపరిచారు.
ఈ సమావేశానికి దాదాపు 3,200 మంది నేతలు హాజరయ్యారు. ఖైదీలను విడుదల చేసే అంశంపై వీరు ప్రధానంగా చర్చించారు.
దాదాపు 19 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలకు మార్గం సుగమం చేసేందుకు ప్రభుత్వం ఈ విధమైన చర్య తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.