పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. తాజాగా రాజౌరీతో పాటు నాలుగు సెక్టార్లలో గురువారం రాత్రి నుంచి పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరుపుతూనే ఉంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎల్వోసీ పర
పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. తాజాగా రాజౌరీతో పాటు నాలుగు సెక్టార్లలో గురువారం రాత్రి నుంచి పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరుపుతూనే ఉంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎల్వోసీ పరిసరాల్లో పాక్ సైన్యం కదలికలు బాగా పెరిగాయి. ఈ కాల్పుల ఘటనలో ఓ బాలికతో పాటు నలుగురు భారత పౌరులు గాయపడ్డారు. ఇక బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో 15 మంది పాకిస్థాన్ రేంజర్లు మృతి చెందారు.
ఇకపోతే.. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో సరిహద్దులోని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దులోని దాదాపు 400 కుటుంబాలు అక్కడి నుంచి తరలివెళ్లాయి. గురువారం రాత్రి నుంచి పాకిస్థాన్ దళాలు జమ్ములోని దాదాపు 24 మన సైన్యం పోస్ట్‌లను టార్గెట్ చేశాయి. నౌషెరా, సుందర్భనీ, పల్లన్వాలా, హీరా నగర్, కాత్వా తదితర సెక్టారులలో పాక్ దళాలు కాల్పులు జరిపాయి.
ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్న అంశంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖను దాటి పీవోకేలోకి ప్రవేశించి అక్కడి ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పటి నుంచి పాక్ కుదురుగా ఉండలేక కాల్పులకు తెగబడుతోందని నిర్మల్ సింగ్ విమర్శించారు. తమ రాష్ట్రంలోకి పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపుతోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు పాక్‌దే బాధ్యత అని అన్నారు. తమ రాష్ట్రమైన కాశ్మీర్‌ను పాకిస్థాన్ అస్థిరపరుస్తోందన్నారు. పాకిస్థాన్‌ని ఓ విఫల దేశంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచ పటం నుంచి ఆ దేశం త్వరలోనే కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు.