ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా.. నేపాలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఇటీవల నేపాల్ తొలి ప్రధాని అయిన తన తాత బీపీ కోయిరాలా స్మారక కేంద్రమును తన కుటుంబ సభ్యులతో సహా ఉన్నత స్థాయి సందర్శనకు రావడంతో ఇలాంటి ఊహాగానాలు తాజాగా బయలుదేరాయి.
తల్లి సుష్మా, తండ్రి ప్రకాష్ కోయిరాలాలతో కలిసి మనీషా.. తూర్పు ఖాట్మండులోని తన తాత స్మారక కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చారు. ఈ కేంద్రం వద్ద ఆమె సుమారు రెండు గంటలకు పైగా గడిపినట్లు తెలిసింది. తన దేశం పట్ల తనకున్న బాధ్యతను అర్థం చేసుకున్నానని ఈ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మనీషా విలేకరులకు తెలిపారు.
ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటీవలే కాశ్మీర్ నుంచి నేపాల్ రాజధానిని చేరుకున్నట్లు మనీషా వివరించారు. అనేక మంది ప్రముఖ నటీనటులు రాజకీయాల్లోకి వచ్చినట్లుగానే.. తనకు కూడా రాజకీయాలపై కొంత మేరకు ఆసక్తి ఉందని మనీషా పేర్కొన్నారు. కాగా, నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర కేబినెట్‌లో 2005లో మంత్రిగా ప్రకాష్ కోయిరాలా సేవలు నిర్వర్తించారు. జ్ఞానేంద్రకు మద్ధతు ఇస్తున్నందుకు 2005-06లో నేపాలీ కాంగ్రెస్‌చే ఉద్వాసనకు గురయ్యారు.